
రవిశాస్త్రి 'రికార్డు' సమం!
ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో మరో సంచలనం నమోదైంది.
కొల్విన్ బే(బ్రిటన్): ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో మరో సంచలనం నమోదైంది. బ్రిటన్ వేదికగా డెర్భీషైర్తో జరిగిన నాలుగురోజుల కంట్రీ చాంపియన్ షిప్లో గ్లామోర్గాన్ ఆటగాడు అనూరిన్ డొనాల్డ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 123 బంతుల్లో ద్విశతకాన్ని నమోదు చేసి ఆ ఫీట్ను వేగంగా సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఘనత భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి పేరిట ఉంది. 1985లో బరోడాతో రంజీ మ్యాచ్లో రవిశాస్త్రి వేగంగా డబుల్ సెంచరీ సాధించాడు.
రవిశాస్త్రి 123 బంతుల్లోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీని సాధించగా, ఇన్నాళ్లకు డొనాల్డ్ కూడా ఆ రికార్డును సరిగ్గా 123 బంతుల్లోనే ద్వితకాన్ని సాధించడం విశేషం. గ్లామోర్గాన్ తొలి ఇన్నింగ్స్ లో డొనాల్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్ గా 136 బంతుల్లో 26 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 234 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో డొనాల్డ్ రాణించడంతో గ్లామోర్గాన్ తన తొలి ఇన్నింగ్స్లో 518 పరుగుల భారీ స్కోరు చేసింది.