ఆధిక్యంలో జింబాబ్వే
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టెస్టులో జింబాబ్వే పటిష్ట స్థితిలో నిలిచింది. 23 పరుగులకే నాలుగు వికెట్లు పడిన దశలో సికిందర్ రజా (158 బంతుల్లో 97 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) పోరాటంతో జింబాబ్వే నిలబడింది. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 68 ఓవర్లలో ఆరు వికెట్లకు 252 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం ఈ జట్టు 262 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండటంతో ఫలితం తేలే అవకాశాలున్నాయి. రజాతో పాటు క్రీజులో ఉన్న వాలర్ (76 బంతుల్లో 56 బ్యాటింగ్; 8 ఫోర్లు) అసమాన బ్యాటింగ్‌తో కీలకంగా నిలిచాడు. వీరిద్దరి మధ్య ఏడో వికెట్‌కు అజేయంగా 107 పరుగులు జత చేరాయి. హెరాత్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. అంతకుముందు శ్రీలంక 102.3 ఓవర్లలో 346 పరుగులకు ఆలౌటైంది.