జడేజా చెప్పాక ట్రిపుల్ గురించి ఆలోచించా
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో చెన్నై టెస్టులో అజేయ ట్రిపుల్ సెంచరీ చేశాక టీమిండియా యువ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ స్టార్ క్రికెటర్ అయ్యాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా కరుణ్ తన మూడో టెస్టులోనే రికార్డు నెలకొల్పడం విశేషం. తద్వారా టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ముందడుగు వేశాడు. అందరూ దీని గురించి మాట్లాడుకోవడం మొదలెట్టిన తర్వాత తన ట్రిపుల్ సెంచరీ విలువ అర్థమైందని కరుణ్ చెబుతున్నాడు. ఓ ఇంటర్వ‍్యూలో అతను పలు విషయాలు వెల్లడించాడు.
‘కుటుంబ సభ్యులు, టీమ్ మేనేజ్‌మెంట్ ఎంతో మద్దతుగా నిలిచారు. ట్రిపుల్ సెంచరీ చేశాక ఎంతో మంది అభినందించారు. గతంతో పోలిస్తే ప్రత్యేకంగా చూస్తున్నారు. అభినందిస్తూ చాలా మెసేజ్‌లు వచ్చాయి. ఈ సంతోష క్షణాలను ఆస్వాదించాను. అభినందనలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు. మ్యాచ్ లో సెంచరీ చేశాక ఒత్తిడి నుంచి బయటపడ్డాను. జట్టుకు ఆధిక్యం లభించాక స్వేచ్ఛగా ఆడాల్సిందిగా నాకు సూచనలు వచ్చాయి. ట్రిపుల్ సెంచరీ చేయడానికి జట్టు సూచనలు ఉపయోగపడ్డాయి. నా శైలిలో స్వేచ్ఛగా షాట్లు ఆడా. నేను 280 పరుగులు చేశాక ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశముందని బ్యాటింగ్ పార్టనర్ రవీంద్ర జడేజా చెప్పాడు. దీంతో చేయగలననే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత ట్రిపుల్ కోసం ఆడాను. ట్రిపుల్ సెంచరీ చేశాక డ్రెస్సింగ్ రూమ్‌లో అందరూ సంతోషంగా స్వాగతం పలికారు. ట్రిపుల్ సెంచరీ చేసిన రోజు సంబరాలు చేసుకోలేదు. మరుసటి రోజు మ్యాచ్ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకున్నాం. అనిల్ కుంబ్లే పిలవడం వల్ల మా తల్లిదండ్రులు ఈ మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియానికి వచ్చారు. అమ్మనాన్నలు ట్రిపుల్ సెంచరీని ప్రత్యక్షంగా చూసినందుకు సంతోషంగా ఉంది’ అని నాయర్ చెప్పాడు.