
వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్ట్‌ల్లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్న నాయర్.. గుల్భర్గా మిస్టిక్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 28) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 40 బంతుల్లోనే శతక్కొట్టి, తన జట్టు (మైసూర్ వారియర్స్) భారీ స్కోర్ సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న నాయర్.. 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి, అజేయంగా నిలిచాడు. నాయర్‌కు ఆర్ సమర్థ్ (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎస్ కార్తీక్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది.
Karun Nair continues his dream run in the Maharaja T20 League 2023. pic.twitter.com/MojOUiPtim
— CricTracker (@Cricketracker) August 28, 2023
నాయర్ విధ్వంసం ధాటికి గుల్భర్గా బౌలర్లు అభిలాష్ షెట్టి (4-0-63-1), విజయ్‌కుమార్ వైశాక్ (4-0-45-0), అవినాశ్ (3.4-0-44-1), నొరోన్హా (2-0-36-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం 249 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుల్భర్గా.. 9 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. గుల్భర్గా ఇన్నింగ్స్‌లో చేతన్ 28, ఆనీశ్ 23, నొరోన్హా 39 నాటౌట్, స్మరణ్ 0, అమిత్ వర్మ 11, హసన్ ఖలీద్ 4 నాటౌట్ పరుగులు చేశారు. మైసూర్ బౌలర్లలో జగదీశ సుచిత్ 2, మోనిశ్ రెడ్డి, గౌతమ్ మిశ్రా తలో వికెట్ పడగొట్టారు.
ఇదిలా ఉంటే, టెస్ట్‌ల్లో భారత్ తరఫున సెహ్వాగ్ 2, కరుణ్ నాయర్ ఓసారి ట్రిపుల్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. సెహ్వాగ్ 2004లో పాకిస్తాన్‌పై తన తొలి ట్రిపుల్ సెంచరీని (309) (భారత్ తరఫున మొట్టమొదటిది), 2008లో సౌతాఫ్రికాపై తన రెండో ట్రిపుల్ హండ్రెడ్‌ను (319) బాదాడు. ఆ తర్వాత 2016లో కరుణ్ నాయర్ ఇంగ్లండ్‌పై చెన్నైలో ట్రిపుల్ సెంచరీని (303 నాటౌట్) సాధించి, భారత్ తరఫున టెస్ట్‌ల్లో సెహ్వాగ్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.