
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరుడు వినోద్ సెహ్వాగ్ అరెస్ట్ అయ్యాడు. చెక్ బౌన్స్ కేసులో చండీఘడ్ పోలీసులు వినోద్ సెహ్వాగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అనేక మార్లు విచారణకు హాజరుకాకపోవడంతో 2023లో స్థానిక కోర్టు వినోద్ సెహ్వాగ్‌తో పాటు మరో ఇద్దరిని దోషులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వినోద్ అరెస్ట్ జరిగింది.
అరెస్ట్ అనంతరం వినోద్ తరఫు న్యాయవాది సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను పోలీసులు వ్యతిరేకించారు. దీంతో దీనిపై విచారణ మార్చి 10కి వాయిదా పడింది. అప్పటివరకు వినోద్ సెహ్వాగ్ పోలీసుల కస్టడీలోనే ఉండనున్నాడు.
అసలేం జరిగిందంటే.. క్సాల్టా ఫుడ్ అండ్ బేవరేజెస్ కంపెనీలో వినోద్ సెహ్వాగ్‌తో పాటు విష్ణు మిట్టల్, సుధీర్ మల్హోత్రా డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీ 2018లో శ్రీ నైనా ప్లాస్టిక్స్ నుండి రూ. 7 కోట్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసింది. చెల్లింపుగా, కంపెనీ రూ. కోటి చొప్పున ఏడు వేర్వేరు చెక్కులను జారీ చేసింది.
అయితే అకౌంట్‌లో సరిపడా నిధులు లేని కారణంగా అన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయి. పలు ఫాలోఅప్‌ల అనంతరం శ్రీ నైనా ప్లాస్టిక్స్ అధినేత కృష్ణణ్ మోహన్ ఖన్నా కోర్టును ఆశ్రయించారు. స్థానిక కోర్టు క్సాల్టా ఫుడ్ అండ్ బేవరేజెస్ డైరెక్టర్లైన వినోద్ సెహ్వాగ్, విష్ణు మిట్టల్, సుధీర్ మల్హోత్రాను నిందితులుగా ప్రకటించింది. ఈ తీర్పుపై వినోద్ సెహ్వాగ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.
ఇదిలా ఉంటే, వీరేంద్ర సెహ్వాగ్‌కు సంబంధించి ఇటీవలికాలంలో వచ్చిన రెండో వార్త ఇది. వీరూ అతని భార్యతో విడాకులు తీసుకోనున్నాడని కొద్ది రోజుల కిందట సోషల్‌మీడియా కోడై కూసింది. ఇన్‌స్టాలో వీరూ, అతని సతీమణి ఇద్దరు అన్‌ఫాలో చేయడంతో ఈ ప్రచారం మొదలైంది. వీరూ గత కొద్ది రోజులుగా తన భార్యను విడిచి పెట్టి, తన ఇద్దరు పిల్లలతో పాటు వేరుగా ఉంటున్నట్లు తెలుస్తుంది. తరుచూ పుణ్యక్షేత్రాలు తిరిగే వీరూ ఈ మధ్యకాలంలో ఒంటరిగా ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు.
46 ఏళ్ల వీరేంద్ర సెహ్వాగ్ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అప్పటినుంచి కామెంటేటర్‌గా, విశ్లేషకుడిగా క్రికెట్‌తో సంబంధం కలిగి ఉంటున్నాడు. సెహ్వాగ్‌కు ఇద్దరు కొడుకులు. ఈ ఇద్దరూ క్రికెటర్లే కావడం విశేషం. సెహ్వాగ్ పెద్ద కొడుకు ఇటీవలికాలంలో జూనియర్ క్రికెట్‌లో సత్తా చాటి వార్తల్లో నిలిచాడు. సెహ్వాగ్‌కు టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌గా పేరుండేది. సెహ్వాగ్ భారత్ తరఫున టెస్ట్‌ల్లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. సెహ్వాగ్ తన కెరీర్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేశాడు. కేవలం బ్రాడ్‌మన్, గేల్, లారా మాత్రమే ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment