కేప్‌టౌన్: అద్భుతమైన ఆట, అదే స్థాయి రచ్చతో పోటాపోటీగా సాగుతున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను మరో కొత్త వివాదం ముంచెత్తింది. ఆసీస్ ఆటగాడు కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించడం తీవ్ర వివాదాన్ని రేపింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో అతను చేసిన పనులు వీడియోలో బయట పడ్డాయి. ముందుగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బెన్‌క్రాఫ్ట్ తన కుడి చేతి వేళ్ల మధ్య టేపును ఉంచి బంతి ఆకారాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అతను దానిని తన జేబులో వేసుకున్నాడు. ఇదంతా టీవీలో ప్రసారమైంది. వెంటనే ఆసీస్ కోచ్ లీమన్ అదనపు ఆటగాడు హ్యాండ్స్‌కోంబ్‌కు వాకీటాకీ ద్వారా ఇదే విషయాన్ని చెప్పాడు. దాంతో ఓవర్ల మధ్య మైదానంలోకి వెళ్లిన హ్యాండ్స్‌కోంబ్, బెన్‌క్రాఫ్ట్‌కు ఈ సమాచారం చేరవేశాడు. విషయం తెలుసుకున్న ఫీల్డ్ అంపైర్లు నైజేల్ లాంజ్, ఇల్లింగ్‌వర్త్ ఈ విషయంపై బెన్‌క్రాఫ్ట్‌ను వివరణ అడిగారు. అయితే అప్పటికే ఆ వస్తువును జేబులోంచి తీసిన ఆసీస్ క్రికెటర్ దానిని అండర్‌వేర్‌లో వేసుకున్నాడు. అంపైర్లు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ జేబులోంచి సన్‌గ్లాసెస్ క్లాత్‌ను తీసి చూపించాడు! ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయిన అంపైర్లు బంతిని మార్చకుండా, పెనాల్టీ పరుగులు విధించకుండా ఆటను కొనసాగించారు.
ఇదీ ప్లాన్...
మనం సాధారణంగా వాడే టేపులో జిగురు భాగంతో పిచ్ సమీపంలో నేలపై రాయాలని బెన్‌క్రాఫ్ట్ భావించాడు. అప్పుడు అక్కడ ఉండే తేలికపాటి కంకర రాళ్లు టేపుకు అంటుకుంటాయి. అప్పుడు ఆ గరుకుతనంతో బంతిని రుద్దితే ఆకారం దెబ్బ తిని రివర్స్ స్వింగ్‌కు అనుకూలంగా మారుతుంది. అయితే అతను అనుకున్న రీతిలో అది ప్రభావవంతంగా పని చేయకపోగా... వీడియోలో మాత్రం పట్టుబడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment