ఐసీసీ అధ్యక్షుడి రాజీనామా
ఢాకా: ప్రపంచకప్ విజేతకు ట్రోఫీ అందించకుండా తనను అడ్డుకున్నారన్న ఆవేదన ఐసీసీ అధ్యక్షుడు ముస్తఫా కమాల్ రాజీనామాకు దారి తీసింది. తాను పదవినుంచి తప్పుకుంటున్నట్లు కమాల్ బుధవారం ప్రకటించారు. అధ్యక్ష హోదాలో ట్రోఫీ ఇవ్వాల్సింది తనేనని, అయితే ఈ విషయంలో తనకు ఉన్న కనీస హక్కులను లాక్కున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఐసీసీ నియమావళికి అనుగుణంగా తనను పని చేయనీయలేదని, దానికి నిరసనగానే పదవినుంచి తప్పుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ‘రాజ్యాంగ విరుద్ధంగా పని చేస్తున్నవారి పట్ల నిరసనగా, క్రికెట్ బాగు కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని కమాల్ ప్రకటించారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ‘నోబాల్’కు సంబంధించి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన కమాల్, ఐసీసీ సభ్యులనుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీనిపై క్షమాపణ చెప్పాలని ఐసీసీ ఒత్తిడి తెచ్చినా, కమాల్ స్పందించలేదు. తదనంతర పరిణామాల్లో ఆయనను ముగింపు కార్యక్రమానికి దూరంగా ఉంచిన ఐసీసీ... ఆస్ట్రేలియా జట్టుకు ట్రోఫీని చైర్మన్‌శ్రీనివాసన్‌తో అందించే ఏర్పాట్లు చేసింది. కమాల్ రాజీనామాను ఐసీసీ ఆమోదించింది.
అది ఇండియన్ క్రికెట్ కౌన్సిల్
ఈ సందర్భంగా ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్‌పై కమాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్‌లా మారిందన్నారు. మెల్‌బోర్న్ మైదానంలో ఐసీసీకి సంబంధించిన స్కోరు బోర్డుపై ‘జీతేగా భాయ్ జీతేగా, ఇండియా జీతేగా’ అనే నినాదాన్ని ప్రదర్శించడం దుర్మార్గమన్న కమాల్... అధ్యక్ష హోదాలో తాను ఆదేశించినా దానిని ఎవరూ తొలగించలేదని విమర్శించారు.
సమావేశమే రాజ్యాంగ విరుద్ధం
అంపైరింగ్ పొరపాట్లపై తాను చేసిన వ్యాఖ్యలకు ఐసీసీ సమావేశంలో తనను వివరణ కోరారని, అయితే ఇది 16 కోట్ల బంగ్లా జాతీయుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోబోనని చెప్పినట్లు కమాల్ వెల్లడించారు. ఐసీసీ నియమావళిలోని 3.3బి క్లాజ్ ప్రకారం తానే ప్రపంచ కప్ ట్రోఫీ అందజేయాలని, అయితే తనకు ఆ అవకాశం ఇవ్వడం లేదని సమావేశంలో చెప్పారన్నారు. కానీ అధ్యక్షుడినైన తనకు మాత్రమే సమావేశం నిర్వహించే హక్కు ఉంటుంది కాబట్టి ఆనాటి ఐసీసీ సమావేశమే రాజ్యాంగవిరుద్ధమని కమాల్ స్పష్టం చేశారు.
నేను సిద్ధం: నజమ్ సేథి
ఐసీసీ అధ్యక్ష పదవి స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చైర్మన్ నజమ్ సేథి చెప్పారు. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే ఐసీసీకి సమాచారం అందించారు. వాస్తవానికి కమాల్ పదవీ కాలం జూన్ వరకు ఉంది. అనంతరం రొటేషన్ పాలసీ ప్రకారం ఒక్కో టెస్టు దేశం అధ్యక్ష పదవిని చేపట్టాల్సి ఉంది. ఈ వరుసలో పాక్‌కు పదవి దక్కాల్సి ఉంది. కాబట్టి నజమ్ దీనిని ఇప్పుడే ఆశిస్తున్నారు.