ఆత్మపరిశీలన అవసరం | Retrospective required | Sakshi
Sakshi News home page

ఆత్మపరిశీలన అవసరం

Published Mon, Aug 17 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

Retrospective required

అనిల్ కుంబ్లే
 
 టెస్టు క్రికెట్‌లో మజా అంటే ఇలాగే ఉంటుంది. ఈ ఫార్మాట్‌లో చివరి బంతి పడేవరకు ఏ మ్యాచ్ కూడా పూర్తి అయినట్టు కాదు. పదే పదే మేం ఈ విషయాన్ని చెబుతూనే ఉంటాం. చాలా కఠినంగానే అయినా భారత జట్టు శనివారం ఈ విషయాన్ని తెలుసుకుంది. తొలి టెస్టు జరిగిన మూడున్నర రోజుల్లో రెండున్నర రోజులు భారత్‌దే ఆధిపత్యమైనా చివరగా నవ్వింది మాత్రం శ్రీలంక జట్టే. నా ఉద్దేశం ప్రకారం ఈ ఓటమికి కారణం బ్యాట్స్‌మెనే. వారికి తుదికంటా క్రీజులో నిలబడదామన్న ఆలోచన లోపించింది. నిజానికి ఆ ముందు రోజు లంక బ్యాట్స్‌మన్ చండీమల్ ఆట నుంచి వీరు నేర్చుకున్నది శూన్యం. కొన్ని నిర్ణయాలు భారత ఆటగాళ్లకు వ్యతిరేకంగా రావచ్చేమో కానీ లంక ముందు వారు నిలబడలేకపోయారు.

 స్వల్ప లక్ష్య ఛేదనను ఆశావహ దృక్పథంతో అధిగమించాల్సి ఉంటుంది. అయితే దీనికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది. బ్యాట్స్‌మెన్ అతిజాగ్రత్తకు పోయి కొంప ముంచగా లంక స్పిన్నర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. వాస్తవానికి స్పిన్నర్ కౌశల్‌కు ఇది తొలి సీజన్. తొలి ఇన్నింగ్స్‌లో పెద్దగా ఆకట్టుకుంది లేదు. ఇక హెరాత్ అసలు ఫామ్‌లో లేడు. అయితే వీరిద్దరిని ఒక్క భారత బ్యాట్స్‌మన్ కూడా సమర్థంగా ఎదుర్కొన్నది లేదు. అసలు వీరికి ఓ వ్యూహమన్నది లేకుండా పోయింది.

ధావన్, కోహ్లి చెరో సెంచరీతో రెండో ఇన్నింగ్స్‌కు దిగారు. ఇక్కడ వీరు చేయాల్సింది ఎడమచేతి బ్యాట్స్‌మన్ ధావన్.. హెరాత్ లెఫార్మ్ స్పిన్‌ను, కుడి చేతి బ్యాట్స్‌మన్ కోహ్లి.. కౌశల్‌ను ఆడుకోవాల్సింది. అయితే ఇలా జరుగలేదు. సహజంగానే విజయం శ్రీలంకను వరించింది. ఈ పరాజయంతో భారత ఆటగాళ్లు ఇక ఎంతోకాలం స్పిన్నర్లను దీటుగా ఎదుర్కోలేరేమోననే విమర్శలు వస్తాయని నాకు తెలుసు. బహుశా జట్టు ఇప్పుడు ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకునేందుకు ఇదే మంచి సమయమేమో.

అసలు జట్టు కూర్పులో స్పిన్నర్లను అద్భుతంగా ఆడగల బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసుకుని వారికి పూర్తి స్వేచ్ఛనివ్వాలి. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో పరధ్యానం పనికి రాదు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో లంక బౌలింగ్ చేసిన విధానం, వారు అందుకున్న క్యాచ్‌ల కారణంగా ఈ విజయానికి అర్హులే. ముఖ్యంగా గాలేలో చివరి టెస్టు ఆడిన సంగక్కరకు ఇది మర్చిపోలేని అనుభూతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement