
ఘనంగా ముగిసిన పారాలింపిక్స్
* ఆకట్టుకున్న విన్యాసాలు
* ఇరాన్ సైక్లిస్ట్ మృతికి నివాళి
రియో డి జనీరో: కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులు.. రంగురంగుల విద్యుత్ కాంతులు.. హోరెత్తించే సంగీత కార్యక్రమాలతో రియో పారాలింపిక్స్ ముగింపు సంబరాలు ఘనంగా జరిగాయి. ఎన్నో అడ్డంకులు, సవాళ్లను అధిగమించిన బ్రెజిల్ మొత్తానికి ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలను విజయవంతంగా ముగించగలిగింది. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున ప్రఖ్యాత మరకానా స్టేడియంలో కన్నులపండవగా జరిగిన ఈ వేడుకలు ‘జీవవైవిధ్యం: మన స్ఫూర్తి’ అనే థీమ్ ఆధారంగా సాగాయి. వేడుకల్లో భాగంగా పలువురు దివ్యాంగులు తమ ప్రదర్శనతో అబ్బురపరిచారు.
పుట్టుకతోనే చేతులు కోల్పోయిన బ్రెజిల్ గిటారిస్ట్ జొనాథన్ బాస్టోస్ తన కాళ్లతో గిటార్‌ను వాయించే ప్రదర్శనతో వేడుకలు ఆరంభమయ్యాయి. ఆ తర్వాత 16 మంది వీల్‌చెయిర్‌లో కూర్చుని చేసిన నృత్యం ఆకట్టుకుంది. అంతర్జాతీయ పారాలింపిక్స్ కమిటీ (ఐపీసీ) అధ్యక్షుడు ఫిలిప్ క్రావెన్ క్రీడలు ముగస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం సింగర్ సాలో లూకాస్ బ్రెజిల్ జాతీయగీతాన్ని ఆలపించారు. ప్రారంభ వేడుకల మాదిరి అందరూ కాకుండా 160 దేశాలకు చెందిన ఒక్కో అథ్లెట్ తమ దేశ పతాకాలను చేతబూని పరేడ్ చేశారు. అంతేకాకుండా పోటీల చివరి రోజు ప్రమాదవశాత్తు మరణించిన ఇరాన్ సైక్లిస్ట్ బహ్మాన్ గోల్బర్నెజ్‌హద్‌కు నివాళిగా నిమిషం పాటు మౌనం పాటించారు. చివర్లో పారాలింపిక్ పతాకాన్ని రియో గేమ్స్ నిర్వాహకులు టోక్యో గవర్నర్‌కు అందించారు. 2020లో ఈ గేమ్స్ జపాన్‌లో జరుగుతాయి.