
వెల్లింగ్టన్: వర్షంతో రెండు రోజుల ఆట రద్దయింది. ఇక మూడే రోజులు మిగిలి ఉన్న టెస్టు మ్యాచ్‌లో ‘డ్రా’ తప్పదనుకుంటున్న తరుణంలో రాస్ టేలర్ (212 బంతుల్లో 200; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అటు కివీస్ బౌలర్లు కూడా బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ ఫలితం దిశగా పయనిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 38/2తో సోమవారం నాలుగో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను కేన్ విలియమ్సన్ (74; 11 ఫోర్లు, 1 సిక్స్), టేలర్ నడిపించారు. వన్డేను తలపించే ఇన్నింగ్స్ ఆడిన టేలర్ ముందుగా కెప్టెన్ విలియమ్సన్‌తో కలిసి మూడో వికెట్‌కు 172 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో లంచ్ విరామానికి ముందే టెస్టుల్లో అతను 18వ సెంచరీని సాధించాడు. రెండో సెషన్‌లో టేలర్‌కు నికోల్స్ (129 బంతుల్లో 107; 9 ఫోర్లు) జతయ్యాడు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 216 పరుగులు జోడించారు. టీ విరామం తర్వాత టేలర్ టెస్టు కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. ఆ వెంటనే ముస్తఫిజుర్ మరుసటిబంతికే ఔటయ్యాడు. అతను నిష్క్రమించే సమయానికి కివీస్ 5 వికెట్లకు 421 పరుగులు చేసింది. కాసేపటికి వాట్లింగ్ (8) ఔట్ కాగానే కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను 432/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 221 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ ఆట నిలిచే సమయానికి 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (4)తో పాటు మోమినుల్ హక్ (10)లను బౌల్ట్... మరో ఓపెనర్ ఇస్లామ్ (29)ను హెన్రీ ఔట్ చేశారు.
క్షమించు క్రో...: న్యూజిలాండ్ బ్యాటింగ్ దిగ్గజం మార్టిన్ క్రో. రెండేళ్ల క్రితం క్యాన్సర్‌తో కన్నుమూసిన ఈ లెజెండ్ టెస్టులో 17 సెంచరీలు చేశారు. సోమవారం ఆయన సెంచరీలను అధిగమించిన అనంతరం టేలర్ ఆకాశం వైపు చూస్తు మనసులో ప్రార్థన చేశాడు. ఆట ముగిశాక దీనిపై అతను మాట్లాడుతూ ‘నేను తన ఘనతను అధిగమించాలని క్రో కోరుకున్నారు. ఇప్పుడీ ఘనత చేరేందుకు చాలా ఆలస్యం చేసినందుకు ఆయన్ని క్షమించమని కోరాను’ అని అన్నాడు.
విలియమ్సన్‌కు గాయం
న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఎడమ చేతి భుజానికి గాయమైంది. ఆదివారం ఫీల్డింగ్ సమయంలోనే గాయమైనప్పటికీ సోమవారం అతను బ్యాటింగ్ చేశాడు. అనంతరం హాస్పిటల్‌కు తీసుకెళ్లి స్కానింగ్ తీయించినట్లు జట్టు వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment