
హామిల్టన్: టీమిండియా చేతిలో 3–0తో ఓటమి బాధాకరమని న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్‌టేలర్ అన్నాడు. పటిష్ఠంగా ఉన్న కోహ్లీసేన స్థాయికి తగినట్లు తాము ఆడలేదని అంగీకరించాడు. ‘3–0 ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. మరీ ఇంత ఘోరంగా ఓడిపోవడం బాధించింది. భారత్ మూడు మ్యాచుల్లోనూ అద్భుతంగా ఆడింది. వారు మాకన్నా ఎంతో పైస్థాయిలో ఉన్నారు. మాపై ఒత్తిడి పెంచి కీలక సమయాల్లో వికెట్లు తీశారు. మేం ఆధిపత్యం వహించే స్థితిలో పట్టు కోల్పోయాం. మేమెంతో పోరాడాం, కానీ ఫలితం లేదు. మరో రెండు మ్యాచులున్నందున సిరీస్ ఇప్పటికే చేజారినా పరువు నిలుపుకొనేందుకు అవకాశం ఉంది. హామిల్టన్ మాకు అచ్చొచ్చింది. మేం తిరిగి లయ అందుకుంటామని నమ్మకముంది. అన్ని విభాగాల్లోనూ మేం రాణించాల్సి ఉంది. విరాట్ అద్భుతమైన నాయకుడు. హార్దిక్ పాండ్యా భారత జట్టుకు సమతూకం తెస్తున్నాడు. కుల్‌దీప్, చాహల్‌ను ఎదుర్కోవాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే’ అని టేలర్ వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment