ఛేజ్‌కు 8 వికెట్లు: విండీస్‌ జయభేరి | Roston chase was a huge victory in the first Test of the Windies | Sakshi
Sakshi News home page

ఛేజ్‌కు 8 వికెట్లు: విండీస్‌ జయభేరి

Published Mon, Jan 28 2019 1:37 AM | Last Updated on Mon, Jan 28 2019 1:37 AM

Roston chase was a huge victory in the first Test of the Windies - Sakshi

బ్రిడ్జ్‌టౌన్‌: వెస్టిండీస్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రోస్టన్‌ ఛేజ్‌ (8/60) తన స్పిన్‌ మాయాజాలంతో ఇంగ్లండ్‌ను తిప్పేశాడు. విండీస్‌కు తొలి టెస్టులో భారీ విజయాన్నందించాడు. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 381 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. 628 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్‌ స్కోరు 56/0తో నాలుగోరోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగుల వద్ద ఆలౌటైంది. 85 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయిన ఇంగ్లండ్‌ 161 పరుగుల వ్యవధిలో మిగతా 9 వికెట్లను కోల్పోయింది.

రోరి బర్న్స్‌ (84; 15 ఫోర్లు) అర్ధసెంచరీ తర్వాత మరెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. స్టోక్స్‌ (34), బెయిర్‌స్టో (30), బట్లర్‌ (26), కెప్టెన్‌ రూట్‌ (22) రెండంకెల స్కోరు చేశారు. జట్టు స్కోరు 200 దాటాక... ఛేజ్‌ స్పిన్‌కు మోకరిల్లిన ఇంగ్లండ్‌ వడివడిగా వికెట్లను కోల్పోయింది. 217/6 స్కోరు వద్ద టీ విరామానికెళ్లిన ఇంగ్లండ్‌ తర్వాత 10 ఓవర్లను పూర్తిగా ఆడలేకపోయింది. గాబ్రియెల్, జోసెఫ్‌ చెరో వికెట్‌ తీశారు. వీరోచిత ద్విశతకం చేసిన వెస్టిండీస్‌ కెప్టెన్‌ హోల్డర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. మూడు టెస్టుల సిరీస్‌లో విండీస్‌ 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు ఈ నెల 31 నుంచి నార్త్‌సౌండ్‌లో జరుగుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement