ఫైనల్లో రుత్విక, రీతుపర్ణ
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియషిప్‌లో తెలంగాణ అమ్మాయిలే టైటిల్ పోరుకు అర్హత సాధించారు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ రీతుపర్ణా దాస్, ఆరో సీడ్ రుత్వికా శివానిలిద్దరూ సెమీఫైనల్స్‌లో విజయం సాధించారు. బుధవారం జరిగిన సెమీస్‌లో రీతుపర్ణ 21-17, 21-18తో టాప్ సీడ్ పి.సి. తులసీ (పెట్రోలియం)పై, రుత్విక 13-21, 21-13, 21-17తో రెండో సీడ్ అరుంధతి పంట్వానే (పెట్రోలియం)పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో పెట్రోలియంకు ఆడుతున్న హైదరాబాదీ ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్ తుదిపోరుకు అర్హత సంపాదించాడు.
సెమీస్‌లో రెండో సీడ్ సాయిప్రణీత్ 21-14, 21-16తో అభిమన్యు సింగ్ (ఎఫ్‌సీఐ)పై గెలువగా... టాప్ సీడ్ ప్రణయ్ (పెట్రోలియం) 14-21, 18-21 తేడాతో మూడో సీడ్ సమీర్ చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో మనూ అత్రి(ఏఏఐ)- సుమిత్ రెడ్డి(ఏపీ) 21-19, 21-18 తేడాతో అల్విన్ ఫ్రాన్సిస్ (కేరళ)-అరుణ్ విష్ణు (పెట్రోలియం)పై, రెండో సెమీస్‌లో ప్రణవ్ చోప్రా (పెట్రోలియం)-అక్షయ్ 21-23, 21-14, 21-17తో షలోక్ రామచంద్రన్ (ఏఐ)-సాన్యం శుక్లా (ఏఐ)పై గెలుపొందారు. మహిళల డబుల్స్‌లో ఐదో సీడ్ అపర్ణాబాలన్-ప్రజక్తా సావంత్ (పెట్రోలియం) 21-14, 21-13తో ధాన్య నాయర్ (రైల్వే)-మోహిత (ఏఏఐ)పై, ప్రద్న్యాగాద్రే-సిక్కిరెడ్డి (ఏఏఐ) 21-16, 21-13తో రీతుపర్ణ-రుత్విక జోడీపై విజయం సాధించారు.