Ruthvika
-
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్, రుత్విక
సిడ్నీ: గాయం నుంచి తేరుకొని మళ్లీ రాకెట్ పట్టిన భారత మాజీ నంబర్‌వన్ పారుపల్లి కశ్యప్, యువతారలు సిరిల్ వర్మ, గద్దె రుత్విక శివాని... ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో ఈ ముగ్గురూ అజేయంగా నిలిచారు. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో కశ్యప్ 21–15, 21–18తో జావో జున్‌పెంగ్ (చైనా), రెండో రౌండ్లో 21–5, 21–16తో ఇండోనేసియా ఓపెన్ రన్నరప్ కజుమాసా సకాయ్ (జపాన్)పై గెలుపొందాడు. సిరిల్ వర్మ తొలి రౌండ్లో 21–9, 21–9తో ఫ్రిట్జ్ మైనకి (ఇండోనేసియా)పై, రెండో రౌండ్లో 21–16, 21–15తో శ్రేయాన్‡్ష జైస్వాల్ (భారత్)పై విజయం సాధించాడు. మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి రౌండ్లో రుత్విక 21–15, 21–15తో సిల్వినా కుర్నియావాన్ (ఆస్ట్రేలియా)పై, రెండో రౌండ్లో 21–9, 21–7తో రువింది సెరెసింఘే (ఆస్ట్రేలియా)పై గెలిచింది. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో క్వాలిఫయర్ కాన్ చావో యు (చైనీస్ తైపీ)తో కిడాంబి శ్రీకాంత్; ఏడో సీడ్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో అజయ్ జయరామ్; ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (కొరియా)తో కశ్యప్; టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్; విటింగస్ (డెన్మార్క్)తో సిరిల్ వర్మ; యూరోపియన్ చాంపియన్ రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)తో ప్రణయ్ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)తో సైనా నెహ్వాల్; ఇండోనేసియా ఓపెన్ చాంపియన్ సయాకా సాటో (జపాన్)తో పీవీ సింధు; చెన్ జియోజిన్ (చైనా)తో రుత్విక శివాని ఆడతారు. -
ఫైనల్లో రుత్విక, రీతుపర్ణ
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ విజయవాడ స్పోర్ట్స్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియషిప్లో తెలంగాణ అమ్మాయిలే టైటిల్ పోరుకు అర్హత సాధించారు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ రీతుపర్ణా దాస్, ఆరో సీడ్ రుత్వికా శివానిలిద్దరూ సెమీఫైనల్స్‌లో విజయం సాధించారు. బుధవారం జరిగిన సెమీస్‌లో రీతుపర్ణ 21-17, 21-18తో టాప్ సీడ్ పి.సి. తులసీ (పెట్రోలియం)పై, రుత్విక 13-21, 21-13, 21-17తో రెండో సీడ్ అరుంధతి పంట్వానే (పెట్రోలియం)పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో పెట్రోలియంకు ఆడుతున్న హైదరాబాదీ ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్ తుదిపోరుకు అర్హత సంపాదించాడు. సెమీస్‌లో రెండో సీడ్ సాయిప్రణీత్ 21-14, 21-16తో అభిమన్యు సింగ్ (ఎఫ్‌సీఐ)పై గెలువగా... టాప్ సీడ్ ప్రణయ్ (పెట్రోలియం) 14-21, 18-21 తేడాతో మూడో సీడ్ సమీర్ చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో మనూ అత్రి(ఏఏఐ)- సుమిత్ రెడ్డి(ఏపీ) 21-19, 21-18 తేడాతో అల్విన్ ఫ్రాన్సిస్ (కేరళ)-అరుణ్ విష్ణు (పెట్రోలియం)పై, రెండో సెమీస్‌లో ప్రణవ్ చోప్రా (పెట్రోలియం)-అక్షయ్ 21-23, 21-14, 21-17తో షలోక్ రామచంద్రన్ (ఏఐ)-సాన్యం శుక్లా (ఏఐ)పై గెలుపొందారు. మహిళల డబుల్స్‌లో ఐదో సీడ్ అపర్ణాబాలన్-ప్రజక్తా సావంత్ (పెట్రోలియం) 21-14, 21-13తో ధాన్య నాయర్ (రైల్వే)-మోహిత (ఏఏఐ)పై, ప్రద్న్యాగాద్రే-సిక్కిరెడ్డి (ఏఏఐ) 21-16, 21-13తో రీతుపర్ణ-రుత్విక జోడీపై విజయం సాధించారు. -
ఫైనల్లో రుత్విక
జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ పాట్నా: జాతీయ జూని యర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ అండర్-19 బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన రుత్విక శివాని ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో రుత్విక 21-16, 21-13తో సహచర ప్లేయర్ వృశాలిపై నెగ్గింది. ఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన రితూపర్ణ దాస్‌తో రుత్విక ఆడుతుంది. మరో సెమీఫైనల్లో రితూపర్ణ దాస్ 21-9, 21-10తో శ్రీకృష్ణ ప్రియను ఓడించింది. అండర్-19 సెమీస్‌లో ఓడి నప్పటికీ వృశాలి అండర్-17 విభాగంలో ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో వృశాలి 21-15, 21-18తో శిఖా గౌతమ్ (కర్ణాటక)పై నెగ్గింది. ఫైనల్లో శ్రేయాన్షి పరదేశి (ఎయిరిండియా)తో ఆమె తలపడుతుంది. అండర్-17 బాలుర సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో సిరిల్ వర్మ 21-10, 21-14తో సహచరుడు కనిష్క్‌ను ఓడించాడు. అండర్-17 బాలుర డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణప్రసాద్-సాత్విక్ సాయిరాజ్ జోడి ఫైనల్లోకి అడుగుపెట్టింది. సెమీఫైనల్లో కృష్ణప్రసాద్-సాత్విక్ సాయిరాజ్ ద్వయం 23-21, 14-21, 21-17తో కార్తీక్ జిందాల్-హర్దీప్ మక్కర్ (హరియాణా) జోడీపై గెలిచింది. -
ప్రిక్వార్టర్స్‌లో రుత్విక ఓటమి
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ కథ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రుత్విక శివాని ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమె 10-21, 15-21తో జపాన్‌కు చెందిన అకెన్ యమగుచి చేతిలో పరాజయం చవిచూసింది. అంతకుముందు మూడో రౌండ్ పోరులో ఆమె 21-16, 18-21, 21-13తో మరియా మిత్సోవా (బల్గేరియా)పై విజయం సాధించింది. తొలి గేమ్‌లో కాస్త పోటీనిచ్చిన ప్రత్యర్థి రెండో గేమ్‌లో విజృంభించి గేమ్‌ను చేజిక్కించుకుంది. తిరిగి నిర్ణాయక మూడో గేమ్‌లో ఏపీ అమ్మాయి పుంజుకొని మిత్సోవాను కంగుతినిపించింది. రుత్విక నెట్ వద్ద 4 పాయింట్లు, స్మాష్‌లతో 8 పాయింట్లు సాధించింది. మిక్స్డ్ డబుల్స్ మూడో రౌండ్ పోటీల్లో మేఘన-సాన్యామ్ శుక్లా జంట 13-21, 10-21తో హే రిన్ కిమ్-జంగ్ హో కిమ్ (దక్షిణకొరియా) జోడి చేతిలో, సంతోష్ రావూరి-పూర్వీషా రామ్ జోడి 11-21, 13-21తో ఫేబియాన్ రోత్-జెన్నిఫర్ కార్నోట్ (జర్మనీ) జంట చేతిలో పరాజయం చవిచూశాయి. మహిళల సింగిల్స్‌లో రితూపర్ణ దాస్, పురుషుల సింగిల్స్‌లో ఆదిత్య జోషి, అరుణ్ జార్జ్‌లు కూడా ఇంటిదారి పట్టారు.