మెయిన్ ‘డ్రా’కు కశ్యప్, రుత్విక
సిడ్నీ: గాయం నుంచి తేరుకొని మళ్లీ రాకెట్ పట్టిన భారత మాజీ నంబర్‌వన్ పారుపల్లి కశ్యప్, యువతారలు సిరిల్ వర్మ, గద్దె రుత్విక శివాని... ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో ఈ ముగ్గురూ అజేయంగా నిలిచారు. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో కశ్యప్ 21–15, 21–18తో జావో జున్‌పెంగ్ (చైనా), రెండో రౌండ్‌లో 21–5, 21–16తో ఇండోనేసియా ఓపెన్ రన్నరప్ కజుమాసా సకాయ్ (జపాన్)పై గెలుపొందాడు.
సిరిల్ వర్మ తొలి రౌండ్‌లో 21–9, 21–9తో ఫ్రిట్జ్ మైనకి (ఇండోనేసియా)పై, రెండో రౌండ్‌లో 21–16, 21–15తో శ్రేయాన్‡్ష జైస్వాల్ (భారత్)పై విజయం సాధించాడు. మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి రౌండ్‌లో రుత్విక 21–15, 21–15తో సిల్వినా కుర్నియావాన్ (ఆస్ట్రేలియా)పై, రెండో రౌండ్‌లో 21–9, 21–7తో రువింది సెరెసింఘే (ఆస్ట్రేలియా)పై గెలిచింది.
బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో క్వాలిఫయర్ కాన్ చావో యు (చైనీస్ తైపీ)తో కిడాంబి శ్రీకాంత్; ఏడో సీడ్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో అజయ్ జయరామ్; ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (కొరియా)తో కశ్యప్; టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్; విటింగస్ (డెన్మార్క్)తో సిరిల్ వర్మ; యూరోపియన్ చాంపియన్ రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)తో ప్రణయ్ తలపడతారు.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో నాలుగో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)తో సైనా నెహ్వాల్; ఇండోనేసియా ఓపెన్ చాంపియన్ సయాకా సాటో (జపాన్)తో పీవీ సింధు; చెన్ జియోజిన్ (చైనా)తో రుత్విక శివాని ఆడతారు.