ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి సచిన్‌ టెండూల్కర్‌ | Sachin Tendulkar, Allan Donald inducted into ICC Hall of Fame | Sakshi
Sakshi News home page

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి సచిన్‌ టెండూల్కర్‌

Published Sat, Jul 20 2019 5:21 AM | Last Updated on Sat, Jul 20 2019 5:21 AM

Sachin Tendulkar, Allan Donald inducted into ICC Hall of Fame - Sakshi

భార్య అంజలితో సచిన్‌

లండన్‌: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రతిష్టాత్మక ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు దక్కింది. అతడితో పాటు దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ అలెన్‌ డొనాల్డ్, ఆస్ట్రేలియా మాజీ మహిళా పేసర్‌ క్యాథరిన్‌ ఫిట్జ్‌ప్యాట్రిక్‌లకు సైతం ఈ గౌరవం లభించింది. లండన్‌లో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో వీరి పేర్లను జాబితాలో చేర్చారు. టెస్టులు (200 మ్యాచ్‌లు 15,921 పరుగులు), వన్డే (463 మ్యాచ్‌లు 18,426 పరుగులు)ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కిన సచిన్‌... భారత్‌ నుంచి ‘ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ ఘనత అందుకున్న ఆరో క్రికెటర్‌. అతడి కంటే ముందు బిషన్‌ సింగ్‌ బేడీ (2009), సునీల్‌ గావస్కర్‌ (2009), కపిల్‌ దేవ్‌ (2010), అనిల్‌ కుంబ్లే (2015), రాహుల్‌ ద్రవిడ్‌ (2018)లకు చోటుదక్కింది.

నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరై అయిదేళ్లు పూర్తయినందున సచిన్‌కు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి అర్హత లభించింది. అతడు 2013 నవంబరులో తన చివరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ‘తరతరాలుగా ఎందరో క్రికెటర్లను వరించిన ఈ ఘనత నాకు గౌరవప్రదమైనది. వారంతా ఆటను ఉన్నత స్థితిలో నిలిపేందుకు ప్రయత్నించారు. అందులో నా పాత్ర కొంత ఉన్నందుకు సంతోషం’ అని సచిన్‌ పేర్కొన్నాడు. ‘ఈ ముగ్గురూ అత్యున్నత ఆటగాళ్లు. వారికి 2019 హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు కల్పిస్తున్నట్లు ప్రకటించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఐసీసీ తరఫున వారికి అభినందనలు’ అని ఐసీసీ సీఈవో మను సాహ్ని పేర్కొన్నాడు.  

► అలెన్‌ డొనాల్డ్‌... దక్షిణాఫ్రికాకు ప్రధాన పేసర్‌గా దశాబ్దం పాటు సేవలందించాడు. గొప్ప బ్యాట్స్‌మెన్‌ను సైతం ఇబ్బంది పెట్టే బౌలర్‌గా పేరుగాంచాడు. 2004లో రిటైరయ్యాడు. 72 టెస్టుల్లో 330, 164 వన్డేల్లో 272 వికెట్లు పడగొట్టాడు. సఫారీ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌ పునరాగమనంలోనే బలమైనదిగా నిలవడంలో డొనాల్డ్‌ కీలక పాత్ర పోషించాడు.

► హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి ఎక్కిన 8వ మహిళా క్రికెటర్‌ క్యాథరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌. ఆస్ట్రేలియాకు 16 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ఆమెకు వేగవంతమైన బౌలర్‌గా పేరుంది. వన్డేల్లో 180 వికెట్లు పడగొట్టిన ఫిట్జ్‌ రెండేళ్ల క్రితం వరకు ఆ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌. ఆసీస్‌ మహిళల జట్టు 1997, 2005 ప్రపంచ కప్‌లు గెలవడంలో ప్రధాన భూమిక ఈమెదే. 2012– 15 మధ్య కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఫిట్జ్‌... తమ దేశానికి వన్డే ప్రపంచ కప్, రెండు టి20 ప్రపంచ కప్‌లు దక్కడంలో పాలుపంచుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement