
చాపెల్ ఓ ‘రింగ్ మాస్టర్’
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియన్ గ్రెగ్ చాపెల్ కోచ్‌గా పనిచేసిన రెండేళ్ల కాలం అత్యంత వివాదాస్పదం. జట్టు ప్రదర్శన సంగతి పక్కన పెడితే...ప్రతీ ఆటగాడు ఆ సమయంలో తీవ్ర అభద్రతా భావానికి లోనయ్యాడనేది నిర్వివాదాంశం. తాజాగా ఇప్పుడు చాపెల్ ఎపిసోడ్‌పై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథలో అనేక అంశాలు వెల్లడించాడు. చాపెల్ వ్యవహార శైలిపై ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ పుస్తకంలో ఆయనో రింగ్ మాస్టర్ అని విరుచుకు పడ్డాడు.
విశేషాలు అతని మాటల్లోనే...
షాక్‌కు గురి చేసింది: 2007 వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్‌కు కొద్ది నెలల సమయమే మిగిలి ఉంది. అప్పుడు భారత జట్టుకు రాహుల్ ద్రవిడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఒక రోజు చాపెల్ మా ఇంటికి వచ్చారు. ఆయన చేసిన ఒక అనూహ్య ప్రతిపాదన నాతో పాటు నా పక్కన ఉన్న అంజలిని కూడా షాక్‌కు గురి చేసింది. ద్రవిడ్‌ను తప్పించి నేను కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలని, అందుకు సహకరిస్తానని ఆయన చెప్పారు.
అలా చేస్తే ఇద్దరం కలిసి రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌ను శాసించవచ్చని గ్రెగ్ అన్నారు. ద్రవిడ్ పట్ల కనీస గౌరవం కూడా ప్రదర్శించకుండా ఆయన అలా మాట్లాడటం నన్ను ఆశ్చర్యపరిచింది. మరో మాట లేకుండా వెంటనే ఆ ప్రతిపాదనను నేను తిరస్కరించాను. మరో రెండు గంటల పాటు అక్కడే ఉన్న చాపెల్, నన్ను ఒప్పించే ప్రయత్నం చేసి ఫలితం లేక వెనుదిరిగారు.
వరల్డ్‌కప్‌కు వద్దని చెప్పేశా: ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకు నేను బీసీసీఐకి ఒక సలహా ఇచ్చాను. అసలు ప్రపంచకప్‌కు జట్టుతో పాటు చాపెల్‌ను పంపవద్దని, ఆయన భారత్‌లో ఉండిపోతేనే మంచిదని చెప్పాను. టోర్నీ సమయంలో సీనియర్ ఆటగాళ్లు బాధ్యత తీసుకుంటారని, జట్టును ఏకతాటిపై ఉంచగలరని బోర్డుకు వెల్లడించాను. అయితే భారత్‌కు సంబంధించి ప్రపంచకప్ దురదృష్టకర రీతిలో ముగిసింది. ఆయన పర్యవేక్షణలో భారత జట్టు పరిస్థితి మరింత ఘోరంగా మారబోతోందని ఆ సమయంలో మాకందరికీ అనిపించింది.
గంగూలీకి అతని అవసరం లేదు: సౌరవ్ గంగూలీ పట్ల చాపెల్ వ్యవహరించిన తీరు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. గంగూలీ వల్లే తనకు కోచ్ పదవి రావడం వాస్తవమేనని చాపెల్ కూడా అంగీకరించారు. అయితే ఈ కారణంగా తాను జీవిత కాలం పాటు గంగూలీ రుణం తీర్చుకుంటూ ఉండలేనని ఆయన చెప్పారు. నిజానికి గంగూలీ జట్టులో ఉండటానికి చాపెల్‌లాంటి వ్యక్తుల అవసరం లేదు. ఆయన కోచ్ పదవినుంచి తప్పుకోగానే జట్టులోని సీనియర్ ఆటగాళ్ళంతా ఊరట దక్కినట్లుగా భావించారు.
తీవ్రంగా స్పందించారు: భారత జట్టు బాగా ఆడినప్పుడు అందరి దృష్టి తనపై పడేలా చాపెల్ ప్రయత్నించడం, జట్టు విఫలమైనప్పుడు మాత్రం ఆటగాళ్లను ముందుకు తోసి తాను తప్పించుకోవాలని చూడటం నాకు బాగా గుర్తుంది. జాన్ రైట్, కిర్‌స్టెన్‌లు మీడియాకు చాలా వరకు దూరంగా ఉంటే చాపెల్ మాత్రం మీడియాలో కనిపించేందుకు తాపత్రయ పడేవారు. 2007 ప్రపంచకప్ తర్వాత భారత్ తిరిగొచ్చాక, మీడియా నా ఇంటి దాకా వచ్చింది.
మా వైఫల్యంపై విమర్శించే హక్కు మీడియాకు ఉంది కానీ ఆటపై దృష్టి పెట్టలేదనడం సరైంది కాదు. అభిమానుల అంచనాలు నిలబెట్టుకోలేకపోతే మమ్మల్ని ద్రోహులుగా చిత్రిస్తారా. ఆ సమయంలో ఫ్యాన్స్ మమ్మల్మి శత్రువులుగా చూశారు. 18 ఏళ్ల ఆట తర్వాత ‘ఎండూల్కర్’ అనే హెడ్డింగ్‌లు రావడంతో రిటైర్మెంట్ గురించి ఆలోచించాను. కుటుంబ సభ్యులు, మిత్రుల సహాయంతో ప్రపంచకప్ జ్ఞాపకాలను నా నుంచి చెరిపేశాను.
లక్ష్మణ్‌నూ వద్దనుకున్నాడు
‘ఒక దశలో భారత జట్టులోని సీనియర్ ప్లేయర్లందరినీ పక్కన పెట్టాలని నిర్ణయించుకున్న చాపెల్, ఆ క్రమంలో జట్టులో సామరస్యాన్ని దెబ్బ తీశారు. ఒకసారి లక్ష్మణ్‌ను ఓపెనర్‌గా ఆడాలని సూచించారు. అయితే దీనిని వీవీఎస్ సున్నితంగా తిరస్కరించాడు. అప్పుడు గ్రెగ్ స్పందనతో మేం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాం. నువ్వు జాగ్రత్తగా ఉండాలని, 32 ఏళ్ల వయసులో పునరాగమనం అంత సులభం కాదనే విషయం గుర్తు పెట్టుకోవాలని ఆయన నేరుగా లక్ష్మణ్‌ను హెచ్చరించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు జట్టులో కొత్త రక్తం నింపాలని, సీనియర్లను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని చాపెల్ నేరుగా బీసీసీఐకే చెప్పినట్లు నాకు తెలిసింది.
అన్నీ నిజాలే చెప్పాడు: గంగూలీ
న్యూఢిల్లీ: గ్రెగ్ చాపెల్ హయాంలో జరిగిన సంఘటనల గురించి సచిన్ టెండూల్కర్ తన పుస్తకంలో అన్నీ నిజాలే చెప్పాడని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ‘టెండూల్కర్ ఈ పుస్తకాన్ని రాసిన విధానం చాలా బాగుంది. నిజంగా ఈ రోజు అతడు భారత క్రికెట్‌కు గొప్ప సహాయం చేసినట్టే. ఇక నుంచైనా చాలా మంది కళ్లు తెరుస్తారనుకుంటాను. అలాగే చాపెల్ గురించి ద్రవిడ్‌కు కూడా అన్నీ తెలుసు. కానీ ఆయన్ని అదుపులో పెట్టలేకపోతున్నట్టు ఆవేదన చెందాడు. ఏదో ఒకరోజు నా తరఫున కూడా అన్ని విషయాలు చెబుతాను’ అని గంగూలీ తెలిపాడు.