
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్... భారత క్రికెట్ నుంచి విడదీయరాని పేరు. అలాంటి వ్యక్తి జీవితంలో చోటుచేసుకున్న ఓ మార్పు... తీసుకున్న ఓ నిర్ణయం... అతడి జీవితాన్ని ఎక్కడో నిలబెట్టింది. ఈ విషయాన్ని ‘విన్నింగ్ లైక్ సచిన్–థింక్ అండ్ సక్సీడ్ లైక్ టెండూల్కర్’ పేరిట తాను రాసిన పుస్తకంలో దేవేంద్ర ప్రభుదేశాయ్ వివరించాడు. ఇంతకీ ఆ విశేషాలేమంటే... 1984లో సచిన్ బాంద్రా ఐఈఎస్ పాఠశాల విద్యార్థిగా ఉండగా అతడి అన్న అజిత్ క్రికెట్ శిక్షణ కోసం రమాకాంత్ ఆచ్రేకర్ వద్దకు తీసుకెళ్లాడు. బాంద్రా పాఠశాలకు ప్రత్యేకించి జట్టు లేనందున చిన్నారి సచిన్‌ను తాను కోచింగ్ ఇస్తున్న దాదర్‌లోని శారదాశ్రమం విద్యా మందిర్‌లో చేర్పించమని ఆచ్రేకర్ సలహా ఇచ్చారు. కానీ, వారు నివాసం ఉండే బాంద్రా నుంచి ఆ పాఠశాల చాలా దూరం.
రాకపోకలకు నేరుగా బస్సు సౌకర్యం కూడా లేదు. పాఠశాల ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతుంది. రోజంతా రాకపోకలకే సరిపోతుంది. దీంతో సచిన్ తండ్రి ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్... ‘ముందు చదువుపై దృష్టి పెట్టు. సెలవుల్లో క్రికెట్ ఆడుకో’ అంటూ తేల్చి చెప్పేశారు. సచిన్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. చివరకు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటాం అంటూ కుటుంబ సభ్యులు చెప్పారు. ఎంతో ప్రేమించే ఆట కోసం ఎంత కష్టమైనా భరిస్తూ పాఠశాల మారేందుకే సచిన్ మొగ్గు చూపాడు. అలా ఆచ్రేకర్ దగ్గర ఓనమాలు నేర్చిన అతడు... క్రికెట్‌లో ఎంత ఎత్తుకు ఎదిగాడో ఇప్పుడు అందరికీ తెలిసిన చరిత్రే.
Comments
Please login to add a commentAdd a comment