అంధుల జట్టుకు సచిన్ అభినందన
న్యూఢిల్లీ: అంధుల ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టును బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించాడు. ఫైనల్లో భారీ స్కోరు సాధించిన పాకిస్థాన్‌ను భారత జట్టు మట్టికరిపించిన సంగతి తెలిసిందే. ‘ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత అంధుల క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు. దేశంలో చాలామందికి వీరు స్ఫూర్తిగా నిలవాలి’ అని సచిన్ ట్వీట్ చేశాడు. భారత్‌లో 22 వేల మంది అంధ క్రికెటర్లు ఉండగా పాక్‌లో 4 వేలు, దక్షిణాఫ్రికాలో 200 మంది ఉన్నారు.
‘దేశం గర్వపడుతోంది’
డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్‌ను ఓడించి ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత అంధుల జట్టును కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రశంసించారు. ‘తొలిసారిగా ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత అంధ క్రికెటర్లు ప్రతిభావంతులే కాకుండా ప్రపంచంలోనే ఉత్తమ జట్టుగా నిలిచే సామర్థ్యం ఉందని నిరూపించుకున్నారు. వారు భారత్‌కు వచ్చాక సన్మానం చేస్తాం. జట్టు సాధించిన విజయానికి దేశం గర్వపడుతోంది’ అని సోనోవాల్ అన్నారు.