సచిన్ మంచి కెప్టెన్
గంగూలీ ప్రశంస
న్యూఢిల్లీ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మెరుగైన సారథేనని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కితాబిచ్చాడు. అతని ఆధ్వర్యంలో భారత్ రాణించకపోయినా, అప్పుడున్న జట్టుతో అంతకు మించి ఆశించడం అత్యాశే అవుతుందని దాదా చెప్పాడు. మాస్టర్‌పై వెలువడిన తాజా పుస్తకం ‘సచిన్ టెండూల్కర్-ద మ్యాన్ క్రికెట్ లవ్డ్ బ్యాక్’లో సచిన్‌తో తన అనుబంధాన్ని గంగూలీ గుర్తు చేసుకున్నాడు.
‘సచిన్ సారథ్యంలో భారత జట్టు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాల్లో పర్యటించింది. కానీ ఎప్పుడూ విదేశాల్లో వరుసగా ఎనిమిది టెస్టులు ఓడిపోలేదు (పరోక్షంగా ధోనిపై విసురు).సచిన్‌కు అప్పుడు నాణ్యమైన జట్టు అందుబాటులో లేదు. సీనియర్లు చాలామంది వైదొలుగుతూ కొత్త కుర్రాళ్ల రాక అప్పుడే మొదలైంది. అలాంటి పరిస్థితుల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశించడం పొరపాటు’ అని గంగూలీ ఆ పుస్తకంలో రాశాడు.