‘భారతరత్న’బ్యాట్ పట్టాడు!
మళ్లీ క్రికెట్ బరిలోకి సచిన్
నేడు ఎంసీసీ ఎగ్జిబిషన్ వన్డే
మధ్యాహ్నం గం. 3.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం
లండన్: సచిన్ టెండూల్కర్ క్రికెట్‌నుంచి రిటైర్ అయిన తర్వాత ఆటపై ఆసక్తి తగ్గిన అభిమానులకు అతని బ్యాటింగ్ మెరుపులు చూసే మరో అవకాశం లభించింది. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన దాదాపు ఆరు నెలల తర్వాత ‘భారతరత్న’ బ్యాట్ పట్టాడు.
‘క్రికెట్ మక్కా’గా పేరొందిన లార్డ్స్ మైదానం ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) శనివారం నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్ వన్డే మ్యాచ్‌లో సచిన్ బరిలోకి దిగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో సచిన్ నాయకత్వంలోని ఎంసీసీ ఎలెవన్, షేన్‌వార్న్ నేతృత్వంలోని రెస్టాఫ్ వరల్డ్ ఎలెవన్‌తో తలపడుతుంది. ‘ఈ మ్యాచ్ కోసం పది రోజుల క్రితం ప్రాక్టీస్ ప్రారంభించాను. క్రికెట్ దుస్తుల్లో మళ్లీ బరిలోకి దిగి షాట్లు ఆడటం చాలా బాగుంది.
అయితే ఇంకా బ్యాట్‌పై నాకు పట్టు చిక్కడం లేదు’ అని సరదాగా వ్యాఖ్యానించిన సచిన్... లార్డ్స్ మైదానంతో తనకు ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. మాస్టర్ ఈ మ్యాచ్‌లో తన మాజీ సహచరుడు ద్రవిడ్‌తో కలిసి ఆడనుండటం విశేషం. అలాగే భారత క్రికెటర్లు సెహ్వాగ్, యువరాజ్ కూడా ఈ మ్యాచ్‌లో సచిన్ ప్రత్యర్థులుగా ఆడబోతున్నారు. ఎంసీసీ ఎలెవన్, రెస్టాఫ్ వరల్డ్ ఎలెవన్ జట్ల తరఫున ఆడుతున్న 22 మంది ఆటగాళ్లలో ప్రస్తుతం 11 మంది మాత్రమే చురుగ్గా క్రికెట్‌లో కొనసాగుతున్నారు.
జట్ల వివరాలు:
ఎంసీసీ ఎలెవన్: సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), రాహుల్ ద్రవిడ్, ఆరోన్ ఫించ్, సయీద్ అజ్మల్, ఉమర్ గుల్, క్రిస్ రీడ్, బ్రియాన్ లారా, డానియెల్ వెటోరి, బ్రెట్‌లీ, చందర్‌పాల్, షాన్ టెయిట్.
రెస్టాఫ్ వరల్డ్ ఎలెవన్: షేన్ వార్న్ (కెప్టెన్), కెవిన్ పీటర్సన్, షాహిద్ ఆఫ్రిది, టినో బెస్ట్, మురళీధరన్, పీటర్ సిడిల్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్, తమీమ్ ఇక్బాల్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, పాల్ కాలింగ్‌వుడ్.