సచిన్ xగంగూలీ
కోల్‌కతా, కేరళ మధ్య నేడు ఐఎస్‌ఎల్ ఫైనల్
ముంబై: దాదాపు పది వారాలుగా అనూహ్య ప్రేక్షకాదరణతో కొనసాగుతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) చివరి అంకానికి చేరుకుంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి చెందిన అట్లెటికో డి కోల్‌కతా... బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు చెందిన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ నేడు (శనివారం) డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే లీగ్ దశలో దుమ్మురేపి నంబర్‌వన్‌గా నిలిచిన చెన్నైయిన్ ఎఫ్‌సీ, రెండో స్థానంలో నిలిచిన ఎఫ్‌సీ గోవా జట్లు సెమీస్‌లోనే వెనుదిరగ్గా... మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన కోల్‌కతా, కేరళ మాత్రం ఫైనల్స్‌కు చేరడం విశేషం.
టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా అంచనాలకు తగ్గట్టుగానే ఆరంభంలో ఎదురు లేకుండా సాగింది. అయితే మధ్యలో మాత్రం పేలవంగా ఆడి నిరాశపరిచింది. మరోవైపు అద్భుతంగా రాణిస్తూ వచ్చిన ఎఫ్‌సీ గోవాపై సెమీస్‌లో పెనాల్టీ షూటౌట్‌లో నెగ్గి పరువు కాపాడుకుంది. ఓవరాల్‌గా ఆడిన 14 మ్యాచ్‌ల్లో కోల్‌కతా నెగ్గింది కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే. అందుకే ప్రారంభ ఐఎస్‌ఎల్ ట్రోఫీని గెలుచుకోవాలంటే దాదా గ్యాంగ్ మరింత కష్టపడాల్సిందే. దీనికి తోడు తమ స్టార్ స్ట్రయికర్ ఫిక్రూ టెఫెరా గాయం కారణంగా దూరం కావడం అట్లెటికోకు గట్టి ఎదురు దెబ్బ. మిడ్‌ఫీల్డర్లు గార్సియా, బోర్జా, పోడని ఆటతీరుపైనే జట్టుకు విజయావకాశాలున్నాయి.
ఇయాన్ హ్యుమేపై ఆశలు: ఇక తమ చివరి మ్యాచ్‌ల్లో అద్భుత ఆటతీరును ప్రదర్శించిన కేరళ జట్టు ప్రత్యర్థిపై కాస్త పైచేయిలోనే ఉంది. లీగ్ దశలో కోల్‌కతాపై ఓ డ్రా, ఓ విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. 15 మ్యాచ్‌ల్లో 5 గోల్స్ సాధించి ఊపుమీదున్న స్టార్ ఫార్వర్డ్ ఇయాన్ హ్యుమే జట్టుకు వెన్నెముకగా ఉంటున్నాడు. కీలక సమయాల్లో రాణిస్తూ తమ జట్టును గట్టెక్కించిన అతను తుది పోరులో రెచ్చిపోతే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. సీనియర్ గోల్‌కీపర్ డేవిడ్ జేమ్స్, ఫార్వర్డ్స్ మైకేల్ చోప్రా, గోన్‌సాల్వెస్, మిడ్‌ఫీల్డర్లు పెన్ ఒర్జి, పియర్సన్ కీలకం కానున్నారు.
నేటి ఫైనల్ సా.గం. 6.00 నుంచి
స్టార్ స్పోర్ట్-2లో ప్రత్యక్ష ప్రసారం