
శ్రీవారి ఆలయంలో సచిన్
సాక్షి, తిరుమల: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి అంజలితో కలసి ఉదయం నైవేద్య విరామ సమయంలో సచిన్ సంప్రదాయ దస్తులతో ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకున్నారు.
తర్వాత హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. సచిన్ వెంట పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కూడా ఉన్నారు. ఆలయం వెలుపల అభిమానులు సచిన్‌ను పలుకరించేందుకు పోటీ పడ్డారు. కొందరు సెల్ఫీలు తీసుకోవటం కనిపించింది.