
కుంబ్లే సలహా.. సాహా విశ్రాంతి
న్యూఢిల్లీ:ఇటీవల తన సత్తా చాటుకుంటూ భారత క్రికెట్ జట్టులో వృద్ధిమాన్ సాహా కీలక ఆటగాడిగా మారిపోయాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో రెండు హాఫ్ సెంచరీలు సాధించి పరిస్థితిని చక్కదిద్దాడు. అయితే టెస్టు సిరీస్ కు ముగిసిన తరువాత ఆ ప్లేయర్ కు టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఒక సలహా సూచించాడట. రంజీ టోర్నీ ఆరంభమైన తరుణంలో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉన్న సాహాను కనీసం రెండు మ్యాచ్ లకు దూరంగా ఉండమని కుంబ్లే సలహా ఇచ్చాడట. దాంతో బెంగాల్ ఆడనున్న తొలి రెండు రంజీ మ్యాచ్ లకు సాహా దూరంగా ఉండనున్నాడు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, పంజాబ్ లతో ఆడే రంజీ మ్యాచ్ ల్లో సాహా పాల్గొనడం లేదనే విషయాన్ని బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ తెలిపాడు.
'కుంబ్లే సలహా మేరకు తొలి రెండు రంజీ మ్యాచ్లకు సాహా దూరంగా ఉండనున్నాడు. భారత్ కు వరుస టెస్టు సిరీస్ ల నేపథ్యంలో సాహాను కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోమని కుంబ్లే చెప్పాడు. ఈ క్రమంలోనే బెంగాల్ ఆడే మొదటి రెండు మ్యాచ్ ల్లో సాహా ఆడే అవకాశం లేదు. త్వరలో ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ఉండటంతో సాహాపై చాలా భారం ఉంది. ఇది కేవలం అతను తీసుకునే సూచనపరమైన విశ్రాంతి మాత్రమే' అని తివారీ పేర్కొన్నాడు.
అయితే అక్టోబర్ 27 నుంచి రైల్వేస్ తో జరిగే మ్యాచ్ కు సాహా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లండ్ తో సిరీస్ నేపథ్యంలో రైల్వేస్ తో జరిగే మ్యాచ్ను సాహా ప్రాక్టీస్ కు ఉపయోగించుకోవచ్చు.