
భారత ‘నంబర్‌వన్’గా..
⇒ ‘ఐటా’ అండర్–16 ర్యాంకింగ్స్‌లో సాయిదేదీప్యకు అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: తెలుగమ్మాయి యెద్దుల సాయిదేదీప్య అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) జూనియర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. అండర్– 16 బాలికల సింగిల్స్ విభాగంలో ఆమె 882 పాయింట్లతో టాప్ ర్యాంకులో నిలిచింది. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఈ ఘనతను తన తల్లి జయకు అంకితమిస్తున్నట్లు దేదీప్య చెప్పింది. 2009లో కర్నూలులో జరిగిన టోర్నీ ద్వారా టెన్నిస్ పోటీలకు శ్రీకారం చుట్టిన ఆమె మరుసటి ఏడాదే తొలి టైటిల్‌ను సాధించింది.
‘ఐటా’ జూనియర్, ర్యాంకింగ్ టోర్నీల్లో ఇప్పటి వరకు 73 టైటిల్స్‌ను చేజిక్కించుకున్న ఆమె 2014లో ఆసియా అండర్–14 చాంపియన్‌షిప్‌లో సింగిల్స్‌లో విజేతగా నిలిచి తొలి అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ‘రోడ్ టు వింబుల్డన్– 2015’ ఈవెంట్‌లోనూ మెరిసింది. ఇందులో మూడు డబుల్స్ టైటిల్స్‌ను సాధించింది. తమిళనాడులోని కరూర్‌లో జరిగిన జాతీయ అండర్–16 సూపర్ సిరీస్ సింగిల్స్‌లోనూ విజేతగా నిలిచింది. న్యూఢిల్లీలో జరిగిన అండర్–18 సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు చేరిన దేదీప్య, అండర్– 16 డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా తృప్తిపడింది.
మహారాష్ట్రలోని పంచగనిలో జరిగిన నేషనల్ సిరీస్ అండర్–16 ఈవెంట్‌లో సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. సిన్నెట్ టెన్నిస్ అకాడమీలో రవిచందర్‌రావు దగ్గర ఆమె టెన్నిస్‌లో ఓనమాలు నేర్చుకుంది. ప్రస్తుతం ఆమె నగరంలోని సరోజినీ నాయుడు వనితా విద్యాలయలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.