కూతురికి వేధింపులు.. తండ్రి అలుపెరగని పోరాటం | Chandigarh Man Extraordinary Mission To Fight Daughter Assaulters | Sakshi
Sakshi News home page

కూతురికి వేధింపులు.. తండ్రి అలుపెరగని పోరాటం

Published Fri, Jul 10 2020 3:59 PM | Last Updated on Fri, Jul 10 2020 4:27 PM

Chandigarh Man Extraordinary Mission To Fight Daughter Assaulters - Sakshi

చండీగఢ్‌: ఆడవారి మీద వేధింపులకు ప్రధానమైన కారణం.. బలహీనులు, బయటకు చెప్తే.. సమాజంతోపాటు కుటుంబ సభ్యులు కూడా వారినే శిక్షిస్తారనే ఉద్దేశంతో చాలా మంది మృగాళ్లు ఆడవారి పట్ల దారుణాలకు పాల్పడుతుంటారు. ప్రతిరోజు వెలుగులోకి వచ్చే వార్తలు చూస్తే.. ఇది నిజమేననిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆడవారికి అన్యాయం జరిగినప్పుడు సమాజం సంగతి పక్కనే పెడితే.. కుటుంబం తోడుగా నిలబడి మద్దతిస్తే చాలు.. మరిన్ని అన్యాయాలు వెలుగులోకి వస్తాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి చండీగఢ్‌లో చోటు చేసుకుంది. కుమార్తెను వేధించిన వారికి శిక్ష పడేలా చేయడం కోసం ఓ తండ్రి అలుపెరగిన పోరాటం చేస్తున్నాడు. ఆ వివరాలు..

చండీగఢ్‌కు చెందిన ఓ యువతి టెన్నిస్‌ శిక్షణ కోసం రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన ఓ అకాడమీలో చేరింది. అక్కడ ఆమెతో పాటు శిక్షణ పొందుతున్న ఓ ఐదుగురు యువకులు బాధితురాలిని లైగింక వేధింపులకు గురి చేశారు. వీరిలో ఒక వ్యక్తి జూనియర్‌ డేవిస్‌ కప్‌ ప్లేయర్‌ కూడా కావడం గమనార్హం. దీని గురించి బాధితురాలు తండ్రితో చెప్పింది. ఆయన ఈ విషయం బయటకు తెలిస్తే.. పరువు పోతుందని ఆలోచించలేదు. తన బిడ్డ పట్ల తప్పుగా ప్రవర్తించిన వారికి శిక్షపడాలని భావించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు కోర్టుకు చేరింది. ఇక వారికి తప్పక శిక్ష పడుతుంది.. కూతురికి న్యాయం జరుగుతుందని ఆశించిన ఆ తండ్రికి నిరాశే ఎదురయ్యింది. కేసు విచారణ సమయంలో పోలీసులు టెన్నిస్‌ అకాడమీ వారు ఇచ్చిన బర్త్‌ సర్టిఫికెట్లు కోర్టుకు అందజేశారు. దాని ప్రకారం నిందితులంతా మైనర్లుగా భావించింది కోర్టు. వారికి బెయిల్‌ మంజూరు చేసింది. తప్పు చేసిన వాళ్లే దర్జగా బయటకు వెళ్తుంటే ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. నిందితులు కోర్టుకు తప్పుడు బర్త్‌ సర్టిఫికెట్లు ఇచ్చారని గ్రహించిన ఆ తండ్రి.. వాస్తవాలు వెలుగు తీసేందుకు ప్రయత్నించాడు. (మరో ఇద్దరు యువతుల ప్రమేయం!)

నిజమైన బర్త్‌ సర్టిఫికెట్ల కోసం 
ఆ తర్వాత కొన్ని నెలల పాటు శ్రమించి ఆ ఐదుగురు నిందితుల స్వగ్రామాలైన హరియాణాలోని రోహ్తక్, పాల్వాల్, హిసార్లలో పర్యటించాడు. నిందితులు ప్రాథమిక స్థాయిలో చదివిన ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి వారి అసలు పుట్టిన తేదీల గురించి ఆరా తీయడం ప్రారంభించాడు. అతడి అనుమానం నిజమయ్యింది. పోలీసులు తప్పుడు బర్త్‌ సర్టిఫికెట్లు సమర్పించారని తెలిసింది. స్కూల్‌ రికార్డ్స్‌ ప్రకారం వారి మైనర్లు కాదని తేలింది. వీటిని కోర్టులో సమర్పించి.. నిందితుల బెయిల్‌ రద్దు చేయాలని బాధితురాలి తండ్రి కోరాడు. కోర్టు దీని గురించి పోలీసులను ప్రశ్నిస్తే వారు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. ‘కోర్టు ఆదేశాల మేరకు మేం పత్రాలను పరిశీలించి రికార్డు సబ్మిట్‌ చేశాం. అయితే నిందితులు ఇచ్చిన పత్రాలు నిజమైనవా.. కావా అనే విషయం తేల్చాల్సింది కోర్టు’ అన్నారు.

ముఖ్యమంత్రికి ఫిర్యాదు
బాధితురాలి తండ్రి ఇంతటితో ఊరుకోలేదు. జరిగిన విషయాల గురించి హరియాణా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాడు. అనంతరం జరిగిన విచారణలో ఒక నిందితుడు తప్పుడు పత్రాలు సమర్పించాడని రుజువయ్యింది. దాంతో ఆరోగ్య శాఖ అతడి బర్త్‌ సర్టిఫికెట్‌ను క్యాన్సల్‌ చేసింది. నిందితుడితో పాటు అతడి తండ్రి, మరో ఇద్దరి మీద కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే కారణంతో కేసు కూడా నమోదు చేసింది. మరో ఇద్దరిపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా కోర్టు విచారణకు తాత్కలికంగా బ్రేక్‌ పడింది. కోర్టులు తెరిచిన తర్వాత అయినా వీరందరికి తగిన శిక్ష పడుతుందని భావిస్తున్నాడు బాధితురాలి తండ్రి.

ఏఐటీఏ నుంచి ఎలాంటి స్పందన లేదు
ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘ఈ విషయం గురించి నేను ఆల్‌ ఇండియా టెన్నిస్‌ అసోసియేషన్‌కు లేఖ రాశాను. కానీ వారి నుంచి  ఎలాంటి స్పందన లేదు. అంతేకాక చండీగఢ్‌ లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌(సీఎల్‌టీఏ) నిందితులకు చట్టపరమైన మద్దతు ఇవ్వడమే కాక వారి బెయిల్‌ బాండ్లను కూడా చెల్లించింది’ అని తెలిపాడు. దీని గురించి సీఎల్‌టీఏను ప్రశ్నించగా.. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్నందున తామేమి స్పందించలేమని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement