సాయిప్రణీత్‌ సంచలనం | sai praneeth enter to semis | Sakshi
Sakshi News home page

సాయిప్రణీత్‌ సంచలనం

Published Sat, Apr 15 2017 1:10 AM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

సాయిప్రణీత్‌ సంచలనం

సాయిప్రణీత్‌ సంచలనం

ప్రపంచ 11వ ర్యాంకర్‌పై విజయం
తొలిసారి సూపర్‌ సిరీస్‌ టోర్నీ సెమీస్‌లోకి
మారిన్‌ చేతిలో సింధు పరాజయం


సింగపూర్‌ సిటీ: అంతర్జాతీయస్థాయిలో కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న భారత యువ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ కెరీర్‌లో తొలిసారి సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ సంచలన విజయం సాధించాడు. ప్రపంచ 11వ ర్యాంకర్, ఎనిమిదో సీడ్‌ తనోంగ్‌సక్‌ సేన్‌సోమ్‌బూన్‌సుక్‌ (థాయ్‌లాండ్‌)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 15–21, 21–14, 21–19తో గెలుపొందాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సాయిప్రణీత్‌ నిర్ణాయక మూడో గేమ్‌లో పలుమార్లు వెనుకబడినా ఏదశలోనూ నిరుత్సాహపడకుండా పట్టుదలతో పోరాడి స్కోరును సమం చేశాడు.

15–17తో వెనుకంజలో ఉన్నపుడు సాయిప్రణీత్‌ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 19–17తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ రెండు పాయింట్ల ఆధిక్యాన్ని కాపాడుకొని సాయిప్రణీత్‌ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ ఏడాది సయ్యద్‌ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సాయిప్రణీత్‌ గతేడాది కెనడా ఓపెన్‌ గ్రాండ్‌ప్రి టోర్నీలో విజేతగా నిలిచాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్‌ లీ డాంగ్‌ కెయున్‌ (దక్షిణ కొరియా)తో సాయిప్రణీత్‌ ఆడతాడు. 2015 జపాన్‌ ఓపెన్‌లో వీరిద్దరూ ఏకైకసారి తలపడగా సాయిప్రణీత్‌ ఓడిపోయాడు.

శ్రీకాంత్‌ జోరు...
మరోవైపు భారత్‌కే చెందిన మరో స్టార్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ ఈ ఏడాది తొలిసారి సూపర్‌ సిరీస్‌ టోర్నీలో సెమీఫైనల్‌ దశకు చేరుకున్నాడు. క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 21–14, 21–16తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ఐదో సీడ్‌ షి యుచి (చైనా)పై గెలిచాడు. ఒకప్పుడు ప్రపంచ మూడో ర్యాంకర్‌గా నిలిచిన శ్రీకాంత్‌ గాయాల కారణంగా కొంతకాలం ఆటకు దూరమై ప్రస్తుతం 29వ ర్యాంక్‌లో ఉన్నాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్‌ ఆంథోనీ జిన్‌టింగ్‌ (ఇండోనేసియా)తో శ్రీకాంత్‌ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో వీరిద్దరూ 1–1తో సమంగా ఉన్నారు.

సింధు తడబాటు...
మహిళల సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు పోరాటం ముగిసింది. ఏకపక్షంగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) 21–11, 21–15తో సింధును ఓడించింది. 35 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు ఏదశలోనూ మారిన్‌కు పోటీనివ్వలేకపోయింది. ఈ విజయంతో రెండు వారాల క్రితం ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ ఫైనల్లో సింధు చేతిలో ఎదురైన పరాజయానికి మారిన్‌ బదులు తీర్చుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సుమీత్‌ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) జంట 11–21, 8–21తో మూడో సీడ్‌ లు కాయ్‌–హువాంగ్‌ యాకియోంగ్‌ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement