సాయిప్రణీత్‌ శుభారంభం | Sai Praneeth Enters Second Round After Defeating Tommy Sugiarto | Sakshi
Sakshi News home page

సాయిప్రణీత్‌ శుభారంభం

Published Thu, Nov 7 2019 3:59 AM | Last Updated on Thu, Nov 7 2019 4:02 AM

Sai Praneeth Enters Second Round After Defeating Tommy Sugiarto - Sakshi

ఫుజౌ (చైనా): ఆరంభంలో తడబడ్డా... వెంటనే తేరుకున్న భారత స్టార్‌ షట్లర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 15–21, 21–12, 21–10తో ప్రపంచ 16వ ర్యాంకర్‌ టామీ సుగియార్తోపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. సుగియార్తోపై సాయిప్రణీత్‌కిది వరుసగా మూడో విజయం. 52 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాయిప్రణీత్‌ తొలి గేమ్‌ను చేజార్చుకున్నా... తదుపరి రెండు గేముల్లో పూర్తి ఆధిపత్యం చలాయించాడు.

నిర్ణాయక మూడో గేమ్‌లో సాయిప్రణీత్‌ ఆరంభంలో 0–3తో వెనుకంజలో నిలిచాక... ఒక్కసారిగా విజృంభించి వరుసగా 10 పాయింట్లు స్కోరు చేసి 10–3తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ఆండెర్స్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)తో సాయిప్రణీత్‌ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఇద్దరు 1–1తో సమంగా ఉన్నారు.

సాయిప్రణీత్‌తోపాటు హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్‌ పారుపల్లి కశ్యప్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టగా... సమీర్‌ వర్మ తొలి రౌండ్‌లోనే ని్రష్కమించాడు. ప్రపంచ 25వ ర్యాంకర్‌ కశ్యప్‌ 44 నిమిషాల్లో 21–14, 21–13తో ప్రపంచ 21వ ర్యాంకర్‌ సిథికోమ్‌ థమాసిన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచాడు. ఈ విజయంతో ఇటీవల డెన్మార్క్‌ ఓపెన్‌లో థమాసిన్‌ చేతిలో ఎదురైన ఓటమికి కశ్యప్‌ బదులు తీర్చుకున్నాడు. ప్రపంచ 17వ ర్యాంకర్‌ సమీర్‌ వర్మ 18–21, 18–21తో ప్రపంచ 28వ ర్యాంకర్‌ లీ చెయుక్‌ యియు (హాంకాంగ్‌) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్, మాజీ విశ్వవిజేత విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)తో కశ్యప్‌ ఆడతాడు.

23 నిమిషాల్లోనే...
మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత కథ ముగిసింది. మంగళవారం ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు తొలి రౌండ్‌లో ఇంటిముఖం పట్టగా... సింధు సరసన సైనా నెహ్వాల్ కూడా చేరింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ సైనా కేవలం 23 నిమిషాల్లో 9–21, 12–21తో ప్రపంచ 22వ ర్యాంకర్‌ కాయ్‌ యాన్‌ యాన్‌ (చైనా) చేతిలో ఓడిపోయింది. గత నెలన్నర కాలంలో సైనా ఐదు టోర్నీలు ఆడగా... ఫ్రెంచ్‌ ఓపెన్‌ మినహా మిగతా నాలుగు టోరీ్నల్లో తొలి రౌండ్‌లోనే ని్రష్కమించడం గమనార్హం.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) 14–21, 14–21తో వాంగ్‌ చి లిన్‌–చెంగ్‌ చి యా (చైనీస్‌ తైపీ) చేతిలో... పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సుమీత్‌ రెడ్డి–మను అత్రి (భారత్‌) 21–23, 19–21తో ఆరోన్‌ చియా–సో వుయ్‌ యిక్‌ (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement