సైనా ‘హ్యాట్రిక్’ విజయం | saina hatrick victory | Sakshi
Sakshi News home page

సైనా ‘హ్యాట్రిక్’ విజయం

Published Tue, Aug 20 2013 2:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM

సైనా ‘హ్యాట్రిక్’ విజయం

సైనా ‘హ్యాట్రిక్’ విజయం

 ముంబై: ఆడిన తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో గెలిచి జోరుమీదున్న పుణే పిస్టన్స్‌కు హైదరాబాద్ హాట్‌షాట్స్ కళ్లెం వేసింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో భాగంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సైనా నేతృత్వంలోని హైదరాబాద్ హాట్‌షాట్స్ రఫ్ ఆడించి 4-1తో పుణే పిస్టన్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 11 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. పురుషుల తొలి సింగిల్స్‌లో అజయ్ జయరామ్ (హైదరాబాద్) 21-19, 21-8తో ప్రపంచ ఐదో ర్యాంకర్ తియెన్ మిన్ ఎన్గుయెన్ (పుణే)ను బోల్తా కొట్టించి హాట్‌షాట్స్‌కు శుభారంభం ఇచ్చాడు. రెండో మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ 17-21, 21-19, 11-6తో ప్రపంచ మూడో ర్యాంకర్ జూలియన్ షెంక్ (పుణే)ను ఓడించి హైదరాబాద్ ఆధిక్యాన్ని 2-0కు పెంచింది.
 
  ఐబీఎల్‌లో సైనాకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో షెమ్ గో-కిమ్ వా లిమ్ జోడి (హైదరాబాద్) 21-19, 21-16తో రూపేశ్ కుమార్-సనావే థామస్ (పుణే) జంటపై గెలిచి హాట్‌షాట్స్‌కు 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని అందించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి హైదరాబాద్ హాట్‌షాట్స్ క్రీడాకారులు విజయాన్ని ఖాయం చేసుకున్నా తదుపరి రెండు మ్యాచ్‌లను తేలిగ్గా తీసుకోలేదు. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో తనోంగ్‌సక్ సెమ్‌సొమ్‌బూన్‌సుక్ (హైదరాబాద్) 21-17, 21-18తో సౌరభ్ వర్మ (పుణే)ను ఓడించడంతో హాట్‌షాట్స్ ఆధిక్యం 4-0కు పెరిగింది. చివరి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-జోచిమ్ ఫిషర్ నీల్సన్ (పుణే) జంట 21-11, 21-14తో షెమ్ గో-ప్రద్య్నా గాద్రె (హైదరాబాద్) జోడిపై నెగ్గి పరిపూర్ణ పరాజయాన్ని తప్పించింది.
 
 తొలి గేమ్ కోల్పోయినా...
 జూలియన్ షెంక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలో తడబడిన సైనా తొలి గేమ్‌ను కోల్పోయింది. అయితే నెమ్మదిగా తేరుకున్న ఈ హైదరాబాద్ రెండో గేమ్‌లో పట్టుబిగించింది. పదునైన స్మాష్‌లు, డ్రాప్ షాట్‌లు సంధిస్తూ నెట్‌వద్ద చురుకుగా కదులుతూ నిలకడగా స్కోరు చేసి రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా ఆరంభంలో 5-1తో ఆధిక్యంలోకి వెళ్లి అదే ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో సైనా స్మాష్‌లతో 30 పాయింట్లు, నెట్‌వద్ద 19 పాయింట్లు గెలుపొందడం విశేషం.
 
 జూలియన్ షెంక్‌ను ఓడించడం ఇదితొలిసా రేం కాదు. గతంలోనూ ఆమెపై పలుమార్లు గెలిచాను. షెంక్‌తో ఆడిన ప్రతిసారీ గట్టి ప్రతిఘటన ఎదురవుతుంది. ఈసారీ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఆఖరికు నేనే గెలవడం ఆనందాన్ని ఇచ్చింది. మొత్తానికి హైదరాబాద్
 హాట్‌షాట్స్ ప్రదర్శన సంతృప్తినిచ్చింది. -సైనా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement