కొనసాగుతున్న పుణే జోరు
పుణే: సొంతగడ్డపై అద్భుత ప్రదర్శన కనబరిచిన పుణే పిస్టన్స్ జట్టు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో మూడో విజయాన్ని నమోదు చేసింది. బంగా బీట్స్‌తో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పుణే పిస్టన్స్ 4-1తో గెలిచి... సెమీస్‌కు చేరువయింది. మరోవైపు బంగా బీట్స్ సెమీస్‌కు చేరాలంటే తమ చివరి రెండు టైలలోనూ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జాతీయ మాజీ చాంపియన్ అనూప్ శ్రీధర్ ఊహించని సంచలనం సృష్టించి పుణేకు శుభారంభం ఇచ్చాడు.
ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ యున్ హూ (బంగా బీట్స్)తో జరిగిన తొలి సింగిల్స్‌లో ప్రపంచ 129వ ర్యాంకర్ అనూప్ శ్రీధర్ వరుస గేముల్లో గెలిచాడు. కేవలం 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీధర్ 21-12, 21-18తో హున్ యూను ఓడించాడు. ఒకప్పుడు భారత అగ్రశ్రేణి క్రీడాకారుడిగా వెలుగొందిన 30 ఏళ్ల శ్రీధర్... యువ ఆటగాళ్ల జోరు పెరగడంతో ప్రస్తుతం చెప్పుకోదగ్గ విజయాలు సాధించడంలేదు. అయితే శుక్రవారం పుణే పిస్టన్స్ తరఫున తొలి సింగిల్స్‌లో బరిలోకి దిగి తన అనుభవాన్నంతా రంగరించి ఆడాడు. ఆద్యంతం దూకుడుగా ఆడుతూ ఏదశలోనూ యున్ హూకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. స్మాష్‌ల ద్వారా 12 పాయింట్లు నెగ్గిన ఈ మాజీ ప్రపంచ 37వ ర్యాంకర్... నెట్‌వద్ద 10 పాయింట్లు సంపాదించాడు. రెండో సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ జూలియన్ షెంక్ 21-20, 21-10తో కరోలినా మారిన్‌ను ఓడించి పుణేకు 2-0 ఆధిక్యాన్ని అందించింది. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో జోచిమ్ ఫిషర్ నీల్సన్-కియోంగ్ తాన్ వీ జోడి 21-18, 21-18తో అక్షయ్ దివాల్కర్-కార్‌స్టెన్ మోగెన్‌సన్ జంటపై నెగ్గడంతో పుణే పిస్టన్స్ 3-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది.
నామమాత్రపు పురుషుల రెండో సింగిల్స్‌లో సౌరభ్ వర్మ 19-21, 21-17, 11-4తో భారత నంబర్‌వన్, ప్రపంచ 14వ ర్యాంకర్ పారుపల్లి కశ్యప్ (బంగా బీట్స్)ను బోల్తా కొట్టించడంతో పుణే ఆధిక్యం 4-0కు పెరిగింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో జోచిమ్ ఫిషర్ నీల్సన్-అశ్విని పొన్నప్ప (పుణే పిస్టన్స్) ద్వయం 21-20, 14-21, 8-11తో కార్‌స్టెన్ మోగెన్‌సన్-కరోలినా మారిన్ (బంగా బీట్స్) జోడి చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. బెంగళూరుకు ఒక పాయింట్ లభించింది. క్లీన్‌స్వీప్ చేసిన తొలి జట్టుగా రికార్డును సాధించే అవకాశం పుణే కోల్పోయింది.
ఐబీఎల్‌లో నేడు
అవధ్ వారియర్స్
x
ముంబై మాస్టర్స్
రాత్రి గం. 8 నుంచి ఈఎస్‌పీఎన్‌లో లైవ్