సెమీస్‌లో సైనా తడబాటు
లీ జురుయ్ చేతిలో 11వ సారి ఓటమి
ఇండియా ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరు
న్యూఢిల్లీ: కీలకదశలో తప్పిదాలు చేసిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మూల్యం చెల్లించుకుంది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోనే నిష్ర్కమించింది. గతేడాది విజేతగా నిలిచిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఈసారి టైటిల్ పోరుకు చేరుకోవడంలో విఫలమైంది. తన చిరకాల ప్రత్యర్థి లీ జురుయ్ (చైనా)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సైనా 20-22, 21-17, 19-21తో పోరాడి ఓడిపోయింది. గంటా 12 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సైనా నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభం నుంచి 19వ పాయింట్ వరకు తన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది.
అయితే లీ జురుయ్ 18-19తో వెనుకబడిన దశలో వరుసగా మూడు పాయింట్లు సాధించి సైనా ఓటమిని ఖాయం చేసింది. లీ జురుయ్ చేతిలో సైనాకిది వరుసగా ఏడో ఓటమి. ఓవరాల్‌గా 11వ పరాజయం కావడం గమనార్హం. తన కెరీర్‌లో ఓ క్రీడాకారిణి చేతిలో సైనా 11 సార్లు ఓడిపోవడం ఇదే ప్రథమం. ఇంతకుముందు యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో సైనా అత్యధికంగా 10 సార్లు ఓటమి చవిచూసింది. సైనా చివరిసారి 2012 ఇండోనేసియా ఓపెన్‌లో లీ జురుయ్‌పై గెలిచింది. ఆ తర్వాత ఈ చైనా ప్లేయర్‌ను ఓడించడంలో సైనా విఫలమైంది.