'పద్మభూషణ్' నామినేషన్ల పై సైనా ఆగ్రహం | Saina Nehwal disappointed by Padma Award snub | Sakshi
Sakshi News home page

'పద్మభూషణ్' నామినేషన్ల పై సైనా ఆగ్రహం

Published Sun, Jan 4 2015 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

'పద్మభూషణ్' నామినేషన్ల పై సైనా ఆగ్రహం

'పద్మభూషణ్' నామినేషన్ల పై సైనా ఆగ్రహం

‘అర్జున’ అవార్డు కోసం ఆటగాడు కోర్టుకెక్కిన ఉదంతం మర్చిపోక ముందే క్రీడల్లో ఇప్పుడు మరోసారి అవార్డుల రగడ మొదలైంది. ఈసారి భారత నంబర్‌వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ వంతు! ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ అవార్డు ఎంపిక కోసం తన దరఖాస్తును తిరస్కరించడంపై ఆమె ఆవేదనతోపాటు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఐదేళ్ల క్రితం ‘పద్మశ్రీ’ పొందిన తనకు నిబంధనల ప్రకారం ఈ అవార్డు పొందే అర్హత ఉందని, తనను కాదని రెజ్లర్ సుశీల్ కుమార్ పేరును ఎలా పరిగణనలోకి తీసుకున్నారని సైనా ప్రశ్నించింది. సైనా స్పందనతో ఇప్పుడు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కూడా డైలమాలో పడింది. ఇద్దరికీ ఇవ్వాలా, లేక నిబంధనలు చూపించి సుశీల్ పేరును కూడా తప్పించాలా అనే ఆలోచనతో అధికారులు ఉన్నారు.
 
 కెరీర్ విశేషాలు
 గత ఐదేళ్లలో సైనా 14 అంతర్జాతీయ టైటిల్స్ నెగ్గింది ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్, ఉబెర్ కప్‌లో కాంస్య పతకాలు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు
 
 
 న్యూఢిల్లీ: అన్ని అర్హతలు ఉన్నా... ‘పద్మభూషణ్’ పురస్కారం కోసం తాను పంపించిన దరఖాస్తును తిరస్కరించడంపై భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆవేదన వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఎంపిక చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది.

 ఏం జరిగిందంటే?
 సైనా నెహ్వాల్ 2010లో ‘పద్మశ్రీ’ అవార్డు అందుకుంది. భారత పౌర పురస్కారాల్లో మూడోదైన ‘పద్మభూషణ్’ కోసం ఆమె 2014లో దరఖాస్తు చేసింది. అయితే నిబంధనల ప్రకారం రెండు పద్మ అవార్డుల మధ్య కనీసం ఐదేళ్ల వ్యవధి ఉండాలి. ఇదే కారణాన్ని ఆమెకు చెబుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైనా దరఖాస్తును తిరస్కరించింది. దాంతో ఈసారి ఐదేళ్లు పూర్తవుతున్నాయి కాబట్టి ఆమె మళ్లీ తన దరఖాస్తును పంపించింది.

 సుశీల్‌కు అవకాశం
 సాధారణంగా కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ఆటగాళ్ల పేర్లను సిఫారసు చేస్తే, హోం మంత్రిత్వ శాఖ వాటికి ఆమోద ముద్ర వేస్తుంది. అయితే తగిన కారణం చూపకుండా ఈసారి కూడా సైనా దరఖాస్తును తిరస్కరించారు. పైగా ‘అవార్డుకు తగిన వ్యక్తి’ అంటూ ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ సుశీల్  పేరును మాత్రం జాబితాలో ఉంచింది. వాస్తవానికి 2011లో పద్మశ్రీ పొందిన సుశీల్‌కు కూడా నిబంధనల ప్రకారం అర్హత లేదు. ఇదే సైనాకు దిగ్భ్రాంతి కలిగించింది. రెజ్లింగ్ సమాఖ్య కార్యదర్శి రాజ్‌సింగ్ చొరవతోనే నిబంధనలు సడలించి సుశీల్ పేరును జాబితాలో చేర్చారని తెలిసింది.

ట్విట్టర్ ద్వారా...
ఈ పరిణామంతో కలత చెందిన సైనా ట్విట్టర్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇందులో కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ తీరును తప్పు పట్టింది. ఇందులో సుశీల్ అర్హతను కూడా ఆమె ప్రశ్నించింది. ‘పద్మ అవార్డు కోసం క్రీడా శాఖ నా పేరును హోం శాఖకు పంపించకపోవడం చాలా బాధ కలిగించింది. నిబంధనల పేరు చెప్పి గత ఏడాది తిరస్కరించారు. నేను కూడా 2012లో ఒలింపిక్స్ పతకం నెగ్గాను. 2010లో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, 2014లో కూడా గొప్ప టైటిల్స్ (ఇండియన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఆస్ట్రేలియన్ ఓపెన్, చైనా ఓపెన్) గెలిచి ప్రస్తుతం వరల్డ్ నంబర్ 4గా ఉన్నాను.

ఇలాంటి అవార్డులు ఆటగాళ్లకు ఉత్ప్రేరకంగా పని చేస్తాయి. క్రీడా శాఖ మరోసారి నా విషయంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇద్దరం 2012 ఒలింపిక్స్‌లో పతకం గెలిచాం కాబట్టి మా ఇద్దరికీ అవార్డు వస్తే చాలా సంతోషం. అయితే ఐదేళ్ల వ్యవధి ఉండాలనే నిబంధన అందరికీ సమంగా వర్తించాలి కదా?’ అని వరుస ట్వీట్‌లతో బహిరంగంగా అసంతృప్తిని ప్రకటించింది. ఈ విషయంలో తాను సంబంధిత అధికారులతో మాట్లాడితే ఇప్పటికే సుశీల్ పేరు హోం శాఖకు వెళ్లిపోయిందని వారు చెప్పారని సైనా వెల్లడించింది. సుశీల్‌ను నిజంగా ప్రత్యేక కేసుగా పరిగణించాల్సి ఉంటే 2012లో ఆ పని చేయాల్సిందని సైనా చెప్పింది. ఇప్పుడు ఒకవైపు నిబంధనలు అంటూ మరోవైపు ఇలా ఎందుకు చేశారని ఆమె అడిగింది.
 
 జాబితాలో ధోని, కోహ్లి, మిథాలీ!
 మరోవైపు ‘పద్మ’ పురస్కారాల కోసం ప్రతిపాదించిన క్రీడాకారుల జాబితాలో భారత క్రికెట్ కెప్టెన్లు ముగ్గురూ ఉండటం విశేషం. ‘పద్మభూషణ్’ కోసం వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ‘పద్మశ్రీ’ కోసం టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేరు కూడా ఉంది. ఎనిమిది సార్లు జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌గా నిలిచిన ఇందు పురి, జాతీయ బాక్సింగ్ కోచ్ గురుబక్ష్ సింగ్, ఫుట్‌బాల్ ఆటగాడు సమర్ బెనర్జీ పేర్లు కూడా పద్మశ్రీ జాబితాలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement