బార్సిలోనా (స్పెయిన్): ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ల కోసం పోరాడుతున్న భారత షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. నేటి నుంచి ఆరంభమయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బార్సిలోనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఏడాది తీవ్రంగా నిరాశ పరిచిన వీరిద్దరూ... 2020 సీజన్‌ను కూడా వరుస వైఫల్యాలతో ఆరంభించారు. సైనా నెహ్వాల్ ఈ ఏడాది ఆడిన మూడు టోర్నీల్లో ఒక్కసారి మాత్రమే తొలి రౌండ్ అడ్డంకిని దాటగా... శ్రీకాంత్ ఆడిన మూడు టోర్నీల్లోనూ తొలి రౌండ్‌లోనే ఓడాడు. ప్రస్తుతం ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్స్‌లో సైనా 22వ స్థానంలో ఉండగా... శ్రీకాంత్ 26వ స్థానంలో ఉన్నాడు.
అయితే క్వాలిఫయింగ్ గడువు ఏప్రిల్‌తో ముగియనుండటంతో... వీరిద్దరూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే గడువు తేదీ నాటికి టాప్–16లో చేరాల్సిన అవసరం ఉంది. దాంతో ఈ టోర్నీతో పాటు తర్వాత జరిగే మరో ఆరు టోర్నీలలో సైనా, శ్రీకాంత్‌లు మెరుగైన ప్రదర్శన చేసి తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకోవాల్సి ఉంది. మహిళల విభాగంలో జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో వైన్నె లీ (జర్మనీ)తో ఐదో సీడ్ సైనా; పురుషుల తొలి రౌండ్ మ్యాచ్‌లో శుభాంకర్ డే (భారత్)తో శ్రీకాంత్ తలపడతారు. రెండో సీడ్‌గా బరిలో దిగాల్సిన ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మిషా జిల్బెర్‌మ్యాన్ (ఇజ్రాయిల్)తో సౌరభ్ వర్మ (భారత్); వైగోర్ కొయెల్హో (బ్రెజిల్)తో పారుపల్లి కశ్యప్ (భారత్); లియూ డారెన్ (మలేసియా)తో హెచ్‌ఎస్ ప్రణయ్ ఆడతారు.
Comments
Please login to add a commentAdd a comment