సైనాకు చేజారిన అవకాశం
రియో డి జనీరో: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ త్రుటిలో అరుదైన అవకాశాన్ని కోల్పోయింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో అథ్లెట్ల సభ్యత్వం కోసం జరిగిన పోటీలో సైనా 1233 ఓట్లు సాధించి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఇందులో తొలి నాలుగు స్థానాల్లో నిలిచినవారు మాత్రమే ఐఓసీ అథ్లెట్ సభ్యులుగా ఎంపికవుతారు. ఒలింపిక్స్ గ్రామంలో 25 రోజుల క్రితం నిర్వహించిన ఈ ఓటింగ్‌లో బీజింగ్ ఒలింపిక్స్ ఫెన్సింగ్ ఈవెంట్ చాంపియన్ బ్రిట్టా హైడ్‌మన్ (జర్మనీ) 1603 ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచాడు.
ఆ తర్వాత దక్షిణ కొరియా టేబుల్ టెన్నిస్ ఆటగాడు సుంగ్ మిన్ ర్యూ (1544), హంగేరికి చెందిన మాజీ స్విమ్మర్ డేనియల్ గ్యుర్తా (1469), రష్యా పోల్‌వాల్టర్ ఎలేనా ఇసిన్ బయేవా (1365) తొలి నాలుగు స్థానాల్లో నిలిచి ఐఓసీ సభ్యులుగా ఎంపికయ్యారు. వీరు రాబోయే ఎనిమిదేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.