సైనా... కొత్త చరిత్ర | saina nehwal New record | Sakshi
Sakshi News home page

సైనా... కొత్త చరిత్ర

Published Sun, Mar 8 2015 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

సైనా... కొత్త చరిత్ర

సైనా... కొత్త చరిత్ర

తొలిసారి ‘ఆల్ ఇంగ్లండ్’ ఫైనల్లోకి
 ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి
 ఓవరాల్‌గా నాలుగో భారతీయ ప్లేయర్
 సెమీస్‌లో, క్వార్టర్స్‌లో చైనీయులపై అద్భుత విజయాలు
 నేడు మారిన్‌తో అంతిమ సమరం

 
 బర్మింగ్‌హమ్: ఎట్టకేలకు సెమీఫైనల్ అడ్డంకిని అధిగమిస్తూ... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా ఈ మెగా ఈవెంట్‌లో ఫైనల్లోకి ప్రవేశించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టిం చింది. ఓవరాల్‌గా భారత్ నుంచి ఫైనల్లోకి అడుగుపెట్టిన నాలుగో ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది.
 
 116 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్ నాథ్ (1947లో), ప్రకాశ్ పదుకొనే (1980, 1981లలో), పుల్లెలగోపీచంద్ (2001లో)  ఫైనల్‌కు చేరుకోగా... ప్రకాశ్ పదుకొనే (1980లో), గోపీచంద్ విజేతలుగా కూడా నిలిచారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ సైనా 21-13, 21-13తో ప్రపంచ 18వ ర్యాంకర్ సున్ యూ (చైనా)పై 50 నిమిషాల్లో గెలిచింది.
 
 భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా 21-19, 21-6తో తన చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ ఐదో ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా)పై 39 నిమిషాల్లో అద్వితీయ విజయం సాధించింది. మ్యాచ్‌లో ఏ దశ నుంచైనా పుంజుకోగలిగిన సత్తా ఉన్న చైనీయులను చివరి పాయింట్ వరకూ తేలిగ్గా తీసుకోకుండా ఆడిన సైనా అనుకున్న ఫలితాలను సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా అమీతుమీ తేల్చుకుంటుంది. ముఖాముఖి రికార్డులో సైనా 3-0తో మారిన్‌పై ఆధిక్యంలో ఉండటం విశేషం.
 
 అలవోకగా...
 ఒకప్పుడు అనధికార ప్రపంచ చాంపియన్‌షిప్‌గా పేరొందిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో వరుసగా తొమ్మిదో ఏడాది ఆడుతోన్న సైనా మూడో ప్రయత్నంలో సెమీఫైనల్ అడ్డంకిని దాటగలిగింది. 2010, 2013లో సెమీస్‌లో ఓడిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఈసారి మాత్రం పూర్తి విశ్వాసంతో కనిపిస్తోంది. సున్ యూతో జరిగిన సెమీస్‌లో సైనాకు తొలి రెండు గేముల్లోనూ ఆరంభ దశలో గట్టిపోటీ లభించింది. అయితే అద్భుత ఫిట్‌నెస్‌తో కనిపిస్తోన్న సైనా కీలకదశల్లో పైచేయి సాధించింది. అడపాదడపా పదునైన స్మాష్‌లు సంధిస్తూ... సుదీర్ఘ ర్యాలీల్లో సూపర్ ఫినిషింగ్ చేస్తూ వరుస పాయింట్లు నెగ్గింది. రెండో గేమ్‌లో స్కోరు 14-13 వద్ద ఉన్నపుడు సైనా వరుసగా ఏడు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
 
 కళ్లుచెదిరే ఆటతో...
 ప్రపంచ ఐదో ర్యాంకర్ యిహాన్ వాంగ్‌తో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లోనూ సైనా కళ్లు చెదిరే ఆటతీరును కనబరిచింది. తన కెరీర్‌లో అత్యధికంగా ఎనిమిదిసార్లు యిహాన్ వాంగ్ చేతిలో ఓడిన సైనా ఈసారి తన ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టింది. పక్కా ప్రణాళికతో ఆడుతూ ఆద్యంతం వాంగ్‌పై ఒత్తిడి ఉండేవిధంగా చూసింది.
 
 తొలి గేమ్ పోటాపోటీగా సాగినా... రెండో గేమ్‌లో మాత్రం సైనా ధాటికి యిహాన్ వాంగ్ బెంబేలెత్తిపోయింది. ఆరంభంలోనే 8-0తో ఆధిక్యంలోకి వెళ్లిన సైనా ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. రెండు పూర్తి గేమ్‌లు జరిగిన మ్యాచ్‌లో యిహాన్ వాంగ్‌ను ఓడించడం సైనాకిదే తొలిసారి. గతంలో 2012 డెన్మార్క్ ఓపెన్‌లో సైనా తొలి గేమ్‌ను 21-12తో నెగ్గి, రెండో గేమ్‌లో 12-7తో ముందంజలో ఉన్నపుడు గాయం కారణంగా వాంగ్ వైదొలిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement