కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగిన సైనా నెహ్వాల్
న్యూఢిల్లీ: మరి కొద్ది రోజుల్లో స్కాట్లాండ్ లో ఆరంభం కానున్న గ్లాస్ గో కామన్వెల్త్ గేమ్స్ నుంచి భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ వైదొలిగింది. ప్రస్తుతం సైనా ఒంటిపై దద్దుర్లుతో బాధపడుతుండటంతో ఆమె టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో కామన్వెల్త్ కు సన్నద్ధమవుదామని భావించిన సైనాకు ఒంటిపై దద్దుర్లు విపరీతమైన బాధ పెట్టడంతో టోర్నీ నుంచి తప్పుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్న సమయంలో సైనాకు ఒంటిపై దద్దుర్లు వచ్చాయి. అది కాస్తా ఎక్కువ కావడంతో ఆమె విశ్రాంతికే పరిమితమైంది.
దీనికి సంబంధించి ఐఎఎన్ఎస్ తో మాట్లాడిన సైనా.. 'నేను కామన్వెల్త్ లో పొల్గొనటానికి సిద్ధంగా లేను. నాకు ఆస్టేలియన్ ఓపెన్ తరువాత తగిన ప్రాక్టీస్ లేదు. ఆ టోర్నీలో ఒంటిపై దద్దుర్లు రావడంతో ఇంటికే పరిమితమయ్యాను. నేను కనీసం ప్రాక్టీస్ కూడా చేయలేకుండా ఉన్నాను. పూర్తి ప్రాక్టీస్ లేకుండా టోర్నీకి వెళ్లలేను. అందుచేత టోర్నీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను' అని పేర్కొంది. ఒంటిపై వచ్చిన చిన్నపాటి దద్దుర్లు తీవ్రంగా బాధించడంతో తిరిగి నుంచి కోలుకోవడానికే చాలా సమయం పట్టడంతో నెట్స్ కి దూరంగా ఉండాల్సి వచ్చిందని సైనా తెలిపింది. ప్రస్తుతం వరల్డ్ చాంపియన్ షిప్, ఆసియన్ గేమ్స్ పైనే దృష్టి పెడుతున్నట్లు సైనా తెలిపింది. ఈనెల 23వ తేదీ నుంచి కామన్వెల్త్ గేమ్స్ ఆరంభమవుతున్న సమయంలో సైనా ఇలా టోర్నీకి దూరం కావడం బాధాకరమే.