క్వార్టర్స్‌లో సైనాకు చుక్కెదురు | Saina Nehwal's defeat at the hands of Tai Xu Ying 7th, | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సైనాకు చుక్కెదురు

Published Sat, Mar 12 2016 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

క్వార్టర్స్‌లో సైనాకు చుక్కెదురు

క్వార్టర్స్‌లో సైనాకు చుక్కెదురు

 తై జు యింగ్ చేతిలో ఏడోసారి ఓడిన భారత స్టార్   ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీ
 
బర్మింగ్‌హమ్: గతేడాది కంటే మెరుగైన ప్రదర్శన చేస్తుందని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు ఈసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో నిరాశ ఎదురైంది. ఈ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో గత సంవత్సరం రన్నరప్‌గా నిలిచిన సైనా ఈసారి మాత్రం క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. ఫలితంగా ఈ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సైనా 15-21, 16-21తో ఓడిపోయింది. ఓవరాల్‌గా తై జు యింగ్ చేతిలో సైనా ఓడిపోవడం ఇది ఏడోసారి కావడం గమనార్హం.

2013లో స్విస్ ఓపెన్‌లో చివరిసారి తై జు యింగ్‌ను ఓడించిన సైనా ఆ తర్వాత ఈ అమ్మాయితో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. రెండు గేముల్లోనూ సైనా తన ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. రెండో గేమ్‌లో ఒకదశలో సైనా వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయి 4-10తో వెనుకబడింది. అయితే నెమ్మదిగా తేరుకున్న ఈ హైదరాబాద్ అమ్మాయి చివరికి 16-17తో స్కోరును సమం చేసేలా అనిపించింది. అయితే కీలకదశలో తై జు యింగ్ మరోసారి విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి సైనా ఓటమిని ఖాయం చేసింది. మరోవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ 21-12, 11-21, 16-21తో హాన్స్ క్రిస్టియన్ విటింగ్‌హస్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement