సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు సైనా అర్హత
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’కు భారత స్టార్ సైనా నెహ్వాల్ అర్హత సాధించింది. ఈ ఏడాదిలో జరిగిన మొత్తం 12 సూపర్ సిరీస్ టోర్నమెంట్లలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా సైనా ఈ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ డిసెంబరు 11 నుంచి 15 వరకు మలేసియాలోని కౌలాలంపూర్‌లో జరుగుతుంది. సూపర్ సిరీస్ టోర్నీలు ముగిశాక టాప్-8లో నిలిచిన వారికి మాత్రమే ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఫైనల్ ర్యాంకింగ్స్‌లో షిజియాన్ వాంగ్ (చైనా) 62,190 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా... సైనా 54,080 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఈ సంవత్సరం సైనా 10 సూపర్ సిరీస్ టోర్నీల్లో ఆడింది. ఈ ఇద్దరితోపాటు యోన్ జూ బే (దక్షిణ కొరియా-53,870 పాయింట్లు), పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్‌సుక్ (థాయ్‌లాండ్-53,450 పాయింట్లు), జురుయ్ లీ (చైనా-52,630 పాయింట్లు), మినత్సు మితాని (జపాన్-52,340 పాయింట్లు), సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా-52,000 పాయింట్లు), యిహాన్ వాంగ్ (చైనా-49,850 పాయింట్లు) కూడా ఈ టోర్నీకి అర్హత పొందారు. అయితే చైనా నుంచి ముగ్గురు అర్హత పొందినా... టోర్నీ నిబంధనల ప్రకారం ఒక దేశం నుంచి ఇద్దరికి మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఫలితంగా షిజియాన్ వాంగ్, జురుయ్ లీ, యిహాన్ వాంగ్‌లలో ఇద్దరు మాత్రమే ఈ టోర్నీలో బరిలోకి దిగుతారు. దాంతో ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచిన తాయ్ జూ యింగ్ (చైనీస్ తైపీ)కు కూడా ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కింది. ఒకవేళ అర్హత సాధించిన వారు ఈ టోర్నీకి దూరంగా ఉంటే తర్వాత స్థానాల్లో ఉన్న వారికి పోటీపడే అవకాశం లభిస్తుంది.