Super Series Finals
-
ఇంతగా ఎప్పుడూ బాధపడలేదు
గత ఏడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో పరాజయం... ఈ ఏడాది ఆగస్టులో వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓటమి... ఇప్పుడు తాజాగా సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో అదే ఫలితం.... పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో విక్టరీకి ‘ఫినిషింగ్ టచ్’ ఇవ్వలేకపోయింది. ఫైనల్లో పరాజయం అనంతరం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఓటమికంటే ఓడిన తీరు తనను ఎక్కువగా బాధ పెట్టిందని తెలిపింది. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే... ఫైనల్ పరాజయంపై... చాలా బాధగా ఉంది (ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ)... వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కూడా ఇలాగే జరిగింది. మ్యాచ్ ముగిశాక చాలా సేపు వరకు కూడా కోలుకోలేదు. నా బాధను దాచుకోలేక ఒంటరిగా వెళ్లి ఏడ్చేశాను. చాలా కష్టపడి చాలా బాగా ఆడిన మ్యాచ్ ఇది. అసలు ఎలా ఓడానో అర్ధం కావడం లేదు. 19–19 వద్ద ఉన్నప్పుడు కూడా పరాజయం గురించి భయపడలేదు. నా వైపు నుంచి ఎలాంటి అనవసర తప్పిదాలు చేయలేదు. ఆఖరి రెండు పాయింట్లపై... నిజానికి ఆ రెండు కూడా నేను ర్యాలీలుగానే ఆడాలని భావించాను. దురదృష్టవశాత్తూ షటిల్స్ నెట్‌ను దాటలేకపోయాయి. వాటిలో ఒక్క పాయింట్ వచ్చినా ఫలితం భిన్నంగా ఉండేదేమో. మ్యాచ్ నాణ్యత గురించి చెప్పాలంటే అంతా గొప్పగా సాగింది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే లీగ్ మ్యాచ్‌లో నేను ఓడించిన యామగుచి వేరు. ఫైనల్లో ఆడిన యామగుచి వేరు. ఫిట్నెస్పరంగా సమస్యలు... ఇంత సుదీర్ఘమైన మ్యాచ్‌లో అలసిపోవడం, మధ్యలో ఆటగాళ్లు ఇబ్బంది పడటం సహజం. ఆమెకు కూడా అలాగే అయింది. ఇటీవల చాలా మంది ర్యాలీలు ఎక్కువగా ఆడుతున్నారు. దానికి నేను కూడా సిద్ధమయ్యే వచ్చాను. అయితే డిఫెన్స్ కూడా బలంగా ఉండటం ముఖ్యం. ఆటపరంగా గెలిచేందుకు నేను ఏం చేయగలనో అంతా చేశాను కానీ చివర్లో అంతా చేజారింది. కీలక ఫైనల్ మ్యాచ్‌లలో ఓటములపై... నాకు కూడా ఫైనల్ ముగిశాక ఒకుహారా మ్యాచే గుర్తుకొచ్చింది. ఆటలో గెలుపోటములు సహజం కానీ కొన్ని విషయాల్లో నేను మరింత మెరుగు పడాల్సి ఉంది. 2017 సంవత్సరం చాలా బాగా సాగింది. నా కెరీర్లో ఒకే ఏడాది ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన సంవత్సరం ఇది. ఫైనల్స్‌లో గెలిస్తే ఇంకా బాగుండేది కానీ రన్నరప్ కూడా మంచి ఫలితమే. వచ్చే ఏడాది కొత్తగా మళ్లీ మొదలు పెడతాను. వరల్డ్ నంబర్‌వన్ కూడా సాధించే అవకాశం ఉంటుంది కదా. ‘చాలా హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. ఇద్దరూ బాగా ఆడారు. ఇద్దరూ గెలిచేలా కనిపించారు. అయితే యామగుచి కీలక సమయంలో ఒత్తిడిని అధిగమించింది. చివర్లో సింధు కొంత అలసిపోవడంతో కొన్ని సార్లు అనుకున్న రీతిలో సరైన షాట్లతో స్పందించలేదు. కాస్త జలుబుతో కూడా బాధపడుతుండటంతో పదే పదే విరామం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆటపరంగా నేను సంతృప్తి చెందాను. గత మ్యాచ్‌లలో ప్రదర్శనను బట్టి సింధు గర్వపడవచ్చు. ఈ ఓటమితో ఆమె బాధ పడటం సహజం. 2017లో ఆమె వరుసగా పెద్ద సంఖ్యలో టోర్నీలు ఆడింది. ఎక్కువగా విశ్రాంతి తీసుకోకుండానే గెలిచింది. సుదీర్ఘ ర్యాలీలు సహజంగా మారుతున్నాయి కాబట్టి సమస్య లేదు. ఇక్కడ కొంత అలసట కనిపించినా... నా దృష్టిలో ఫిట్నెస్పరంగా బ్యాడ్మింటన్ సర్క్యూట్లో ఆమె అత్యుత్తమ క్రీడాకారిణులలో ఉంటుంది. కాబట్టి నాకు ఆమె ఫిట్నెస్ గురించి ఎలాంటి ఆందోళన లేదు. ఆమె తన తప్పులు సరిదిద్దుకొని మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. – ‘సాక్షి’తో పుల్లెల గోపీచంద్, భారత కోచ్ -
సైనా, శ్రీకాంత్ జోరు
వరుసగా రెండో విజయం సెమీస్ అవకాశాలు మెరుగు వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ దుబాయ్: ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా సైనా నెహ్వాల్... అరంగేట్రంలోనే అద్బుత ఆటతీరుతో శ్రీకాంత్... బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్నారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో సైనా 21-12, 21-18తో సుంగ్ జీ హ్యున్ (దక్షిణ కొరియా)పై గెలుపొందగా... పురుషుల గ్రూప్ ‘బి’ సింగిల్స్ లీగ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-18, 21-13తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. తాజా విజయాలతో సైనా, శ్రీకాంత్‌లకు సెమీఫైనల్ చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఇద్దరూ తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో ఉండటం విశేషం. అయితే శుక్రవారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల ఫలితాలు, సమీకరణాల ఆధారంగానే సెమీఫైనల్ బెర్త్‌లు ఖాయమవుతాయి. గురువారం విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ రెండు స్థానాలు ఎగబాకి తన కెరీర్లోనే అత్యుత్తమంగా ఆరో స్థానానికి చేరుకోవడం విశేషం. గతంలో సుగియార్తోతో ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఓడిపోయిన శ్రీకాంత్ ఈసారి మాత్రం ఆద్యంతం ఆధిపత్యం చలాయించి తన ప్రత్యర్థికి తేరుకునే అవకాశం ఇవ్వలేదు. మరోవైపు సుంగ్ జీ హ్యున్‌పై గతంలో ఐదుసార్లు నెగ్గిన సైనా ఈసారీ పైచేయి సాధించింది. శుక్రవారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో యోన్ జూ బే (కొరియా)తో సైనా; జోర్గెన్సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్ తలపడతారు. నేటి మ్యాచ్‌లు మ.గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో లైవ్ -
ర్యాంకుల్లోనూ పతనం
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కెరీర్లో ఈ ఏడాది ఏ రకంగానూ కలిసి రాలేదు. ఒక్క టైటిల్ కూడా నెగ్గకుండానే సీజన్ ముగించిన సైనా ర్యాంకుల్లోనూ మరింత దిగజారింది. గురువారం ప్రకటించిన తాజా బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో సైనా (60830 పాయింట్లు)ఎనిమిదో స్థానానికి పడిపోయింది. గత వారం ఆరో స్థానంలో ఉన్న సైనా సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో సెమీస్ కూడా చేరలేకపోవడం ర్యాంకుపై ప్రభావం చూపించింది. పీవీ సింధు తన 11వ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. -
వరుసగా రెండో ఓటమి
కౌలాలంపూర్: ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఆట తీరు మెరుగుపర్చుకోలేక వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. దీంతో సెమీస్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. గురువారం జరిగిన గ్రూప్-బి రెండో లీగ్ మ్యాచ్‌లో సైనా 9-21, 14-21తో ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. కేవలం 27 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి గేమ్ ఆరంభంలోనే 1-2తో వెనుకబడింది. ఈ దశలో చైనా క్రీడాకారిణి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 8-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత సైనా వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గినా... ప్రత్యర్థిని మాత్రం అధిగమించలేకపోయింది. ఇక్కడి నుంచి ఇద్దరు ప్లేయర్లు ఒకటి, రెండు పాయింట్లతో గేమ్‌ను కొనసాగించారు. చివరకు జురుయ్ స్కోరు 13-9 ఉన్న దశలో వరుసగా 8 పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో కాస్త పుంజుకున్నట్లు కనిపించిన ఏపీ క్రీడాకారిణి 5-5తో స్కోరును సమం చేసినా ఆ తర్వాత వెనుకబడింది. జురుయ్ రెండుసార్లు వరుసగా 3 పాయింట్లు గెలిస్తే సైనా ఒక్కో పాయింట్‌తో సరిపెట్టుకుంది. స్కోరు 15-11 ఉన్న దశలో జురుయ్ 4 పాయింట్లు సొంతం చేసుకోగా, సైనా మూడు పాయింట్లు గెలిచింది. దీంతో స్కోరు 19-14కు చేరుకుంది. చివరకు రెండు చక్కని పాయింట్లతో జురుయ్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్ మొత్తంలో ఇద్దరు క్రీడాకారిణిలు స్మాష్‌ల ద్వారా, నెట్ వద్ద ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయారు. శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో సైనా... యోన్ జూ బే (దక్షిణ కొరియా)తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో సైనా కచ్చితంగా గెలవడంతో పాటు... మరో మ్యాచ్‌లో లీ జురుయ్ కూడా గెలవాలని కోరుకోవాలి. -
సైనాకు షాక్
కౌలాలంపూర్: సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు తొలి మ్యాచ్‌లోనే చుక్కెదురైంది. ఈ ఏడాది తన పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ ఈ హైదరాబాద్ అమ్మాయి బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో 21-19, 22-24, 19-21తో మినత్సు మితాని (జపాన్) చేతిలో ఓడిపోయింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను నెగ్గిన సైనా రెండో గేమ్‌లో 7-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైన సైనా ప్రత్యర్థి మినత్సుకు పుంజుకునే అవకాశం ఇచ్చింది. ఒకదశలో సైనా 11-7తో నాలుగు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సైనాను తొలిసారి ఓడించిన మినత్సు పట్టువదలకుండా పోరాడి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి స్కోరును 11-11వద్ద సమం చేసింది. ఆ తర్వాత ఇరువురి మధ్య ఆధిక్యం దోబూచులాడింది. చివర్లో వరుసగా రెండు పాయింట్లు నెగ్గి మినత్సు రెండో గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా పలుమార్లు ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే స్థిరమైన ఆటతీరును కనబర్చడంలో విఫలమైన సైనా మరోసారి మినత్సుకు తేరుకునే అవకాశం ఇచ్చింది. 17-17 వద్ద స్కోరును సమం చేసిన మినత్సు స్కోరు 19-19 వద్ద వరుసగా రెండు పాయింట్లు సాధించి సైనా ఆశలను ఆవిరి చేసింది. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ (చైనా)తో సైనా ఆడుతుంది. తొలిసారి లీ చోంగ్ వీ... ఇదే టోర్నమెంట్ ద్వారా తొలిసారి బ్యాడ్మింటన్‌లో సందేహాస్పద నిర్ణయాలపై సమీక్ష పద్ధతిని ప్రవేశపెట్టారు. తొలిసారి ఈ పద్ధతిని ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) ఉపయోగించాడు. జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్ సందర్భంగా లీ చోంగ్ వీ 2-4తో వెనుకబడిన దశలో అంపైర్ ప్రకటించిన నిర్ణయాన్ని సవాలు చేశాడు. లైన్ అంపైర్ షటిల్ బయటకు వెళ్లిందని ప్రకటించగా... అనుమానం వచ్చిన లీ చోంగ్ వీ సమీక్ష కోరాడు. వీడియో రీప్లేలో షటిల్ లైన్ మీద పడిందని తేలింది. -
సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు సైనా అర్హత
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’కు భారత స్టార్ సైనా నెహ్వాల్ అర్హత సాధించింది. ఈ ఏడాదిలో జరిగిన మొత్తం 12 సూపర్ సిరీస్ టోర్నమెంట్లలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా సైనా ఈ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ డిసెంబరు 11 నుంచి 15 వరకు మలేసియాలోని కౌలాలంపూర్‌లో జరుగుతుంది. సూపర్ సిరీస్ టోర్నీలు ముగిశాక టాప్-8లో నిలిచిన వారికి మాత్రమే ఈ టోర్నమెంట్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఫైనల్ ర్యాంకింగ్స్‌లో షిజియాన్ వాంగ్ (చైనా) 62,190 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా... సైనా 54,080 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం సైనా 10 సూపర్ సిరీస్ టోర్నీల్లో ఆడింది. ఈ ఇద్దరితోపాటు యోన్ జూ బే (దక్షిణ కొరియా-53,870 పాయింట్లు), పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్-53,450 పాయింట్లు), జురుయ్ లీ (చైనా-52,630 పాయింట్లు), మినత్సు మితాని (జపాన్-52,340 పాయింట్లు), సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా-52,000 పాయింట్లు), యిహాన్ వాంగ్ (చైనా-49,850 పాయింట్లు) కూడా ఈ టోర్నీకి అర్హత పొందారు. అయితే చైనా నుంచి ముగ్గురు అర్హత పొందినా... టోర్నీ నిబంధనల ప్రకారం ఒక దేశం నుంచి ఇద్దరికి మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఫలితంగా షిజియాన్ వాంగ్, జురుయ్ లీ, యిహాన్ వాంగ్లలో ఇద్దరు మాత్రమే ఈ టోర్నీలో బరిలోకి దిగుతారు. దాంతో ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచిన తాయ్ జూ యింగ్ (చైనీస్ తైపీ)కు కూడా ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కింది. ఒకవేళ అర్హత సాధించిన వారు ఈ టోర్నీకి దూరంగా ఉంటే తర్వాత స్థానాల్లో ఉన్న వారికి పోటీపడే అవకాశం లభిస్తుంది.