వరుసగా రెండో ఓటమి | Super Series Final: Saina Nehwal facing early exit after second straight loss | Sakshi
Sakshi News home page

వరుసగా రెండో ఓటమి

Published Fri, Dec 13 2013 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

వరుసగా రెండో ఓటమి

వరుసగా రెండో ఓటమి

కౌలాలంపూర్: ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఆట తీరు మెరుగుపర్చుకోలేక వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. దీంతో సెమీస్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. గురువారం జరిగిన గ్రూప్-బి రెండో లీగ్ మ్యాచ్‌లో సైనా 9-21, 14-21తో ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది.
 
  కేవలం 27 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి గేమ్ ఆరంభంలోనే 1-2తో వెనుకబడింది. ఈ దశలో చైనా క్రీడాకారిణి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 8-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత సైనా వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గినా... ప్రత్యర్థిని మాత్రం అధిగమించలేకపోయింది. ఇక్కడి నుంచి ఇద్దరు ప్లేయర్లు ఒకటి, రెండు పాయింట్లతో గేమ్‌ను కొనసాగించారు. చివరకు జురుయ్ స్కోరు 13-9 ఉన్న దశలో వరుసగా 8 పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో కాస్త పుంజుకున్నట్లు కనిపించిన ఏపీ క్రీడాకారిణి 5-5తో స్కోరును సమం చేసినా ఆ తర్వాత వెనుకబడింది.
 
 జురుయ్ రెండుసార్లు వరుసగా 3 పాయింట్లు గెలిస్తే సైనా ఒక్కో పాయింట్‌తో సరిపెట్టుకుంది. స్కోరు 15-11 ఉన్న దశలో జురుయ్ 4 పాయింట్లు సొంతం చేసుకోగా, సైనా మూడు పాయింట్లు గెలిచింది. దీంతో స్కోరు 19-14కు చేరుకుంది. చివరకు రెండు చక్కని పాయింట్లతో జురుయ్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్ మొత్తంలో ఇద్దరు క్రీడాకారిణిలు స్మాష్‌ల ద్వారా, నెట్ వద్ద ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయారు. శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో సైనా... యోన్ జూ బే (దక్షిణ కొరియా)తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో సైనా కచ్చితంగా గెలవడంతో పాటు... మరో మ్యాచ్‌లో లీ జురుయ్ కూడా గెలవాలని కోరుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement