సైనా, శ్రీకాంత్ జోరు
వరుసగా రెండో విజయం
సెమీస్ అవకాశాలు మెరుగు
వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ
దుబాయ్: ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా సైనా నెహ్వాల్... అరంగేట్రంలోనే అద్బుత ఆటతీరుతో శ్రీకాంత్... బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్నారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో సైనా 21-12, 21-18తో సుంగ్ జీ హ్యున్ (దక్షిణ కొరియా)పై గెలుపొందగా... పురుషుల గ్రూప్ ‘బి’ సింగిల్స్ లీగ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-18, 21-13తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. తాజా విజయాలతో సైనా, శ్రీకాంత్‌లకు సెమీఫైనల్ చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఈ ఇద్దరూ తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో ఉండటం విశేషం. అయితే శుక్రవారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల ఫలితాలు, సమీకరణాల ఆధారంగానే సెమీఫైనల్ బెర్త్‌లు ఖాయమవుతాయి. గురువారం విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ రెండు స్థానాలు ఎగబాకి తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఆరో స్థానానికి చేరుకోవడం విశేషం.
గతంలో సుగియార్తోతో ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఓడిపోయిన శ్రీకాంత్ ఈసారి మాత్రం ఆద్యంతం ఆధిపత్యం చలాయించి తన ప్రత్యర్థికి తేరుకునే అవకాశం ఇవ్వలేదు. మరోవైపు సుంగ్ జీ హ్యున్‌పై గతంలో ఐదుసార్లు నెగ్గిన సైనా ఈసారీ పైచేయి సాధించింది. శుక్రవారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో యోన్ జూ బే (కొరియా)తో సైనా; జోర్గెన్‌సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్ తలపడతారు.
నేటి మ్యాచ్‌లు మ.గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో లైవ్