సైనాకు షాక్
కౌలాలంపూర్: సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు తొలి మ్యాచ్‌లోనే చుక్కెదురైంది. ఈ ఏడాది తన పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ ఈ హైదరాబాద్ అమ్మాయి బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో 21-19, 22-24, 19-21తో మినత్సు మితాని (జపాన్) చేతిలో ఓడిపోయింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను నెగ్గిన సైనా రెండో గేమ్‌లో 7-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైన సైనా ప్రత్యర్థి మినత్సుకు పుంజుకునే అవకాశం ఇచ్చింది. ఒకదశలో సైనా 11-7తో నాలుగు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సైనాను తొలిసారి ఓడించిన మినత్సు పట్టువదలకుండా పోరాడి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి స్కోరును 11-11వద్ద సమం చేసింది.
ఆ తర్వాత ఇరువురి మధ్య ఆధిక్యం దోబూచులాడింది. చివర్లో వరుసగా రెండు పాయింట్లు నెగ్గి మినత్సు రెండో గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా పలుమార్లు ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే స్థిరమైన ఆటతీరును కనబర్చడంలో విఫలమైన సైనా మరోసారి మినత్సుకు తేరుకునే అవకాశం ఇచ్చింది. 17-17 వద్ద స్కోరును సమం చేసిన మినత్సు స్కోరు 19-19 వద్ద వరుసగా రెండు పాయింట్లు సాధించి సైనా ఆశలను ఆవిరి చేసింది. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ (చైనా)తో సైనా ఆడుతుంది.
తొలిసారి లీ చోంగ్ వీ...
ఇదే టోర్నమెంట్ ద్వారా తొలిసారి బ్యాడ్మింటన్‌లో సందేహాస్పద నిర్ణయాలపై సమీక్ష పద్ధతిని ప్రవేశపెట్టారు. తొలిసారి ఈ పద్ధతిని ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) ఉపయోగించాడు. జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్ సందర్భంగా లీ చోంగ్ వీ 2-4తో వెనుకబడిన దశలో అంపైర్ ప్రకటించిన నిర్ణయాన్ని సవాలు చేశాడు. లైన్ అంపైర్ షటిల్ బయటకు వెళ్లిందని ప్రకటించగా... అనుమానం వచ్చిన లీ చోంగ్ వీ సమీక్ష కోరాడు. వీడియో రీప్లేలో షటిల్ లైన్ మీద పడిందని తేలింది.