సైనా శుభారంభం
కశ్యప్, శ్రీకాంత్ కూడా..
సంధు, జ్వాలా జోడికి చుక్కెదురు
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్
టోక్యో : జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యా యి. స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ముందంజ వేయగా, పి.వి.సింధు, జ్వాలా జోడికి చుక్కెదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, రెండోసీడ్ సైనా 21-14, 22-20తో బుసానన్ ఒంగ్‌బుమరాంగ్‌పన్ (థాయ్‌లాండ్)పై నెగ్గి రెండోరౌండ్‌లోకి ప్రవేశించింది. 43 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరంభంలో తడబడ్డ హైదరాబాదీ కీలక సమయంలో బాగా పుంజుకుంది. తొలి గేమ్‌లో 1-4తో వెనుకబడ్డ సైనా...4-4, 8-8, 10-10తో స్కోరు సమం చేసింది.
తర్వాత స్కోరు 13-14 ఉన్న దశలో భారత అమ్మాయి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గగా, ప్రత్యర్థి ఒక పాయింట్‌తో సరిపెట్టుకుంది. చివర్లో సైనా మరో మూడు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 4-4 ఉన్న దశలో సైనా వరుసగా ఐదు పాయింట్లు 9-4 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇక్కడి నుంచి సైనా ఒకటి, రెండు పాయింట్లు నెగ్గితే.. అవకాశం వచ్చినప్పుడల్లా బుసానన్ రెండు, మూడు పాయింట్లతో గట్టిపోటీ ఇచ్చింది.
చివరకు స్కోరు 19-19 ఉన్న దశలో థాయ్ ప్లేయర్ అద్భుతమైన డ్రాప్ షాట్‌తో 20-19 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ దశలో సైనా గేమ్ పాయింట్‌ను కాపాడుకోవడంతో పాటు మరో రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మరో మ్యాచ్‌లో సింధు 13-21, 21-17, 11-21తో మినత్సు మితాని (జపాన్) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ తొలిరౌండ్‌లో జ్వాల-అశ్విని 20-22, 21-18, 13-21తో 8వ సీడ్ జావో యునెలి-జాంగ్ క్వినాక్సిన్ (చైనా) చేతిలో; ప్రద్య్నా గాద్రె-సిక్కి రెడ్డి 6-21, 17-21తో టాప్‌సీడ్ మిసాకి మట్సుటోమో-అయకా తకహషి (జపాన్) చేతిలో ఓడారు.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో కశ్యప్ స్కోరు 3-2 ఉన్న దశలో టకుమా ఉడే (జపాన్) మ్యాచ్ మధ్యలో నుంచి వైదొలిగాడు. మరో మ్యాచ్‌లో మూడోసీడ్ శ్రీకాంత్ 21-18, 21-15తో స్కాట్ ఇవాన్స్ (ఐర్లాండ్)పై; హెచ్.ఎస్.ప్రణయ్ 23-21, 22-20తో వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై నెగ్గి తదుపరి రౌండ్‌లోకి అడుగుపెట్టారు. అజయ్ జయరామ్ 10-21, 10-21తో ఏడోసీడ్ విక్టర్ అక్సిల్‌సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశాడు. సాయి ప్రణీత్ 21-23, 10-21తో లీ డాంగ్ కెన్ (జపాన్) చేతిలో ఓడాడు. రెండోరౌండ్‌లో కశ్యప్.. శ్రీకాంత్‌తో తలపడతాడు.