హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో సెయింట్ మార్టిన్స్, కేవీబీఆర్ స్టేడియం జట్లు గెలుపొందాయి. సికింద్రాబాద్ వైఎంసీఏ కోర్టులో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మార్టిన్స్ క్లబ్ 57-48తో భవాన్స్ జూనియర్ కళాశాలపై గెలిచింది. మార్టిన్స్ జట్టులో బెన్న 20, మనోజ్ 9 పాయింట్లు చేశారు. భవాన్స్ తరఫున నిఖిల్ 21, రాహుల్ 9 పాయింట్లు సాధించారు. రెండో మ్యాచ్‌లో కేవీబీఆర్ 60-57తో వైఎంజీపై నెగ్గింది. దినేశ్ (20), మిథిల్ (19), వినయ్ (15) కేవీబీఆర్‌కు పాయింట్లు తెచ్చిపెట్టారు. వైఎంజీ జట్టులో శామ్యూల్ (31) ఒంటరి పోరాటం చేశాడు. సైనిక్‌పురి 35-27తో ఎన్‌ఎన్‌పీజీపై విజయం సాధించింది.
సైనిక్‌పురి జట్టులో విజయ్ (14), పాల్ (7) రాణించగా, ఎన్‌ఎన్‌పీజీ తరఫున వరుణ్ 8, శశి 5 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్‌లో బీహెచ్‌ఈఎల్ ‘ఎ’ జట్టు 49-39తో హాస్టలర్స్‌పై గెలిచింది. బీహెచ్‌ఈఎల్ జట్టులో తులసి 14, పాల్ 10 పాయింట్లు చేయగా, హాస్టలర్స్‌లో సాహిల్ (18) ఆకట్టుకున్నాడు. బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ 74-60తో సీఆర్‌పీఎఫ్‌ను ఓడించింది. బాయ్స్ జట్టులో అమన్ (26), అశోక్ (21) అదరగొట్టారు. సీఆర్‌పీఎఫ్‌కు కిరణ్, జాషువా చెరో 18 పాయింట్లు చేసిపెట్టారు.