హ్యాట్రిక్‌ల జోరు.. సిక్సర్‌ల హోరు.. | Sakshi Premier League Cricket Matches In Karimnagar | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా సాగుతున్న సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌

Published Wed, Jan 8 2020 8:11 AM | Last Updated on Wed, Jan 8 2020 8:19 AM

Sakshi Premier League Cricket Matches In Karimnagar

సాక్షి, కరీంనగర్‌స్పోర్ట్స్‌: క్రికెట్‌ అంటే ఇదా.. ఇలా ఆడుతారా.. అరె బాల్‌ గాల్లో ఎటు వెలుతుందో కనిపించడం లేదే.. ఇంత ప్రతిభ ఉందా.. ఇంత బాగా ఆడుతారా.. ఒక వైపు సిక్స్‌ల మోత.. మరో వైపు హ్యాట్రిక్‌ వికెట్‌లు తీస్తు పెవిలియన్‌కు పంపివేత.. ఇలా ఆద్యంతం ఆహ్లాదంతో అభిమానుల కేరింతల మధ్య రెండో రోజు ఎస్సారార్‌ కళాశాల మైదానంలో సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం పోటీలు ముగిసేసరికి సీనియర్స్‌ విభాగంలో క్వార్టర్స్‌ ఫైనల్‌కు మ్యాచ్‌లు చేరుకున్నాయి. శ్రీ చైతన్య విద్యాసంస్థలు, సుధాకర్‌ పైప్‌లు, నంది టైర్స్‌ అండ్‌ ట్యూబ్స్, ఈ మెయిల్‌లు స్పాన్సర్‌షిప్‌లను అందిస్తున్న ఈ లీగ్‌ ఆసక్తికరంగా జరుగుతుండడం విశేషం. 

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌
ప్రస్తుతకాలంలో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని, క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ఎస్సారార్‌ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కలువకుంట్ల రామకృష్ణ అన్నారు. లీగ్‌ పోటీల్లో భాగంగా మంగళవారం ఉదయం ఎస్సారార్‌ కళాశాల మైదానంలో ట్రినిటీ, కిట్స్‌ కళాశాలల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ క్రీడాకారులను పరిచయం చేసుకొని బ్యాటింగ్‌ చేసి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్‌కు ఉన్నంత క్రేజీ దేశంలో మరె ఇతర క్రీడలకు లేదన్నారు. కార్యక్రమంలో కరీంనగర్‌ సాక్షి యూనిట్‌ బ్రాంచి మేనేజర్‌ వైద శ్రీనివాస్, సర్క్యూలేషన్‌ మేనేజర్‌ అబ్దుల్లాతో పాటు మధుకర్‌రెడ్డి, క్రికెట్‌ కోచ్‌ డి.శ్రీను, సాక్షి సిబ్బంది, వివిధ జట్ల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టిన క్రీడాకారులు..
వివిధ కళాశాలల క్రీడాకారులు తమ వీరోచితమైన ఆటతీరును కనబరుస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు. బంతి ఏ సైడ్‌ నుంచి వచ్చినా బాదుడే లక్ష్యంగా పెట్టుకొని ఫోర్లు, సిక్సర్‌లు కొడుతూ హాఫ్‌ సెంచరీల మార్క్‌ను అవలీలగా దాటుతున్నారు. మధు (శ్రీచైతన్య ఇంజినీరింగ్‌ కళాశాల) 29 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌ తో 52 పరుగులు, నిఖిల్‌ (కిట్స్‌ కళాశాల) 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 పరుగులు, శివ (కిట్స్‌ కళాశాల) 20 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 పరుగులు, జంపన్న (నిగమా కళాశాల) 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

హ్యాట్రిక్‌ వీరులు..
పలువురు క్రీడాకారులు రెండో రోజు సైతం సిక్సర్ల వర్షం కురిపించారు. కొందరు అవలీలగా సిక్స్‌లు బాదగా మరికొందరు బౌలింగ్‌లో సత్తా చాటి బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌ బాట పట్టించారు. బౌలింగ్‌లో జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌ కళాశాల తిమ్మాపూర్‌కు చెందిన క్రీడాకారుడు శ్రీరామ్‌ హ్యాట్రిక్‌ వికెట్లను తీసి అదుర్స్‌ అనిపించగా, బ్యాటింగ్‌లో నిగమా ఇంజినీరింగ్‌ కళాశాల సాంబయ్యపల్లికి చెందిన జంపన్న వరుసగా మూడు సిక్స్‌లు బాది కేక పుట్టించాడు.

రెండోరోజు విజేతలు వీరే.. 
జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌ కళాశాల జట్టు, ట్రినిటి డిగ్రీ కళాశాల పెద్దపల్లిపై 8 వికెట్లు, ట్రినిటి ఇంజినీరింగ్‌ కళాశాల కరీంనగర్‌ జట్టు, ఎన్‌ఎస్‌వీ డిగ్రీ కళాశాల జగిత్యాలపై 6 వికెట్లు, నిగమా ఇంజినీరింగ్‌ కళాశాల జట్టు, వాగేశ్వరీ ఇంజినీరింగ్‌ కళాశాలపై 23 పరుగులు, ఎంఐఎంఎస్‌ డిగ్రీ కళాశాల మంచిర్యాల జట్టు, వాగ్దేవి డిగ్రీ కళాశాల హుజూరాబాద్‌పై 8 వికెట్లు, శ్రీ చైతన్య ఇంజినీరింగ్‌ కళాశాల జట్టు, వాణినికేతన్‌ డిగ్రీ కళాశాల కరీంనగర్‌పై 60 పరుగులు, కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల హుజూరాబాద్‌ జట్టు, ట్రినిటి డిగ్రీ కళాశాల కరీంనగర్‌పై 76 పరుగులు, శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల కరీంనగర్‌ జట్టు, ట్రినిటి ఇంజినీరింగ్‌ కళాశాల పెద్దపల్లిపై 35 పరుగుల తేడాతో విజయాలు నమోదు చేశాయి.

నేడు జరిగే మ్యాచ్‌లు.. 
గ్రౌండ్‌ 1: ఉదయం 7.30 గంటలకు శ్రీచైతన్య ఇంజినీరింగ్‌ కళాశాల తిమ్మాపూర్‌ వర్సెస్‌ వివేకానంద డిగ్రీ కళాశాల కరీంనగర్‌. ఉదయం 10 గంటలకు జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌ కళాశాల తిమ్మాపూర్‌ వర్సెస్‌ కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల హుజూరాబాద్‌. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీచైతన్య ఇంజినీరింగ్‌ కళాశాల తిమ్మాపూర్, వివేకానంద డిగ్రీ కళాశాల కరీంనగర్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుతో నిగమా ఇంజినీరింగ్‌ కళాశాల సాంబయ్యపల్లి జట్టు మధ్య మ్యాచ్‌. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్సారార్‌ డిగ్రీ కళాశాల కరీంనగర్, అరుణోదయ డిగ్రీ కళాశాల కోరుట్ల జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుతో ట్రినిటి ఇంజినీరింగ్‌ కళాశాల బైపాస్‌ రోడ్‌ కరీంనగర్‌ జట్ల మధ్య మ్యాచ్‌.

గ్రౌండ్‌ 2: ఉదయం 7.30 గంటలకు ఎస్సారార్‌ డిగ్రీ కళాశాల కరీంనగర్‌ వర్సెస్‌ అరుణోదయ డిగ్రీ కళాశాల కోరుట్ల. ఉదయం 10 గంటలకు ఎంఐఎంఎస్‌ డిగ్రీ కళాశాల మంచిర్యాల వర్సెస్‌ శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల కరీంనగర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement