కరీంనగర్ స్పోర్ట్స్: వెంకటస్వామి స్మారకార్థం నిర్వహించిన టీ–20 క్రికెట్ పోటీల్లో భాగంగా జోనల్ స్థాయి విభాగంలో చాంపియన్ షిప్ ట్రోపీని కరీంనగర్ జిల్లా జట్టు సాధించగా రన్నరప్ ట్రోపీని మంచిర్యాల జిల్లా జట్టు గెలుచుకుంది. తెలంగాణవ్యాప్తంగా ఈ టోర్నమెంట్ జరుగుతుండగా సోమవారం జోనల్‌స్థాయిలో ఫైనల్ మ్యాచ్ కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో కరీంనగర్, మంచిర్యాల జిల్లా జట్ల మధ్య జరిగింది.
సాయంత్రం జరిగిన బహుమతి ప్రదా నోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, మాజీ హెచ్‌సీఏ అధ్యక్షుడు వినోద్, కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, ఏసీపీ వెంకటరమణ హాజరై ట్రోపీలతోపాటు లక్ష రూపాయల చెక్ అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల్లో క్రేజీ గేమ్ క్రికెట్ అన్నారు. జిల్లా నుంచి రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించి దేశం తరఫున ఆడేలా క్రీడాకారులు తయారు కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆగంరావు, జిల్లా క్రికెట్ సంఘం బాధ్యుడు మహేందర్‌గౌడ్, మురళీధర్‌రావు, సుకుమార్, మనోహర్‌రావు, జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు నందెల్లి మహిపాల్, కోచ్‌లు చందు,శ్రీను పాల్గొన్నారు.
ఉత్కంఠంగా ఫైనల్...
కరీంనగర్, మంచిర్యాల జిల్లాల జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన మంచిర్యాల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. కరీంనగర్ బౌలింగ్‌లో ఆకాశ్‌రావు, విష్ణురెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి ఇద్దరు 4 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి చెరి రెండు వికెట్లు పడగొట్టారు. తదనంతరం బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టులో షానావాజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు ట్రోపీ అందించాడు. కేవలం 29 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్స్‌తో చెలరేగి 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లో మధుకర్ 22, సిద్దార్థరెడ్డి 23, హరేన్ 26 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment