
సందీప్ ‘ఫుల్ స్వింగ్’
పంజాబ్ విజయాల్లో కీలకం సందీప్‌శర్మ
ఆకట్టుకుంటున్న యువ పేసర్
అండర్-19తో గుర్తింపు
దేశవాళీలోనూ మంచి ప్రదర్శన
సాక్షి క్రీడావిభాగం
దాదాపు రెండేళ్ల క్రితం...అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్. అప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియాతో భారత్ పోరు.. తొలి ఓవర్ వేసిన సందీప్ శర్మ నాలుగో బంతికే వికెట్ తీశాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్లోనూ మరో వికెట్. అంతే...8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఆ తర్వాత ఒత్తిడిలో తక్కువ స్కోరు పరిమితమై, భారత్ విజయానికి బాట పరిచింది. ఆ మ్యాచ్‌లో 4 వికెట్లతో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన సందీప్ శర్మ ఆ తర్వాత మరింత రాటుదేలాడు. అన్ని ఫార్మాట్లలోనూ కీలక బౌలర్‌గా ఎదిగిన అతను, ఇప్పుడు ఐపీఎల్‌తో అందరి దృష్టిలో పడ్డాడు.
స్వింగ్ బలం
పాటియాలాలో స్కూల్ క్రికెట్ స్థాయిలో బ్యాట్స్‌మెన్‌గా ఆటను ప్రారంభించినా...కోచ్ సలహాతో సందీప్ బౌలింగ్ వైపు మళ్లాడు. వేగంకంటే కచ్చితత్వాన్నే ఎక్కువగా నమ్ముకున్న అతనికి స్వింగ్ ప్రధానాయుధం. ముఖ్యంగా నేరుగా వచ్చి పిచ్ అయిన తర్వాత బయటి వైపు వెళ్లే బంతి ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెడుతుంది. అదే బాల్ సందీప్‌కు గేల్ వికెట్‌ను అందించింది.
‘బెంగళూరు జట్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉండటంతో అంతకు ముందు రోజు నా బలమైన ఈ డెలివరీపై బాగా సాధన చేశాను. ఎక్కువగా ఎడమ చేతివారికే బౌలింగ్ చేశాను. అది ఫలితాన్నిచ్చింది’ అని అతను ఆనందంగా చెప్పాడు. అయితే పిచ్ బంతి స్వింగ్‌కు అనుకూలంగా లేనప్పుడు బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసేందుకు యార్కర్లు, స్లో బౌన్సర్లపై కూడా సాధన చేస్తున్నట్లు అతను చెప్పాడు.
అండర్-19తో గుర్తింపు
పంజాబ్ తరఫున అండర్-19 స్థాయిలో ఆకట్టుకోవడంతో సందీప్ శర్మ 2010 అండర్-19 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో జట్టు ప్రదర్శన గొప్పగా లేకున్నా...ఇండియా తరఫున ఎక్కువ వికెట్లు సాధించాడు. దాంతో 18 ఏళ్ల వయసులో అతనికి తొలి సారి పంజాబ్ రంజీ జట్టులో చోటు లభించింది.
అయితే 2010 అండర్-19 ప్రపంచ కప్ ఓటమిని వెనక్కి నెడుతూ మళ్లీ రెండేళ్ల తర్వాత కూడా సత్తా చాటి భారత్‌ను విజేతగా నిలపడంలో భాగమయ్యాడు. 2012 టోర్నమెంట్‌లో ఈ పంజాబీ క్రికెటర్ 6 మ్యాచుల్లో 15.75 సగటుతో 12 వికెట్లు తీసి టీమ్ టాపర్‌గా నిలిచాడు. ఆ తర్వాత అతను పంజాబ్ ప్రధాన పేసర్‌గా జట్టులో భాగమయ్యాడు. రంజీల్లో ఆడిన తొలి సీజన్ (2012-13)లోనే 9 మ్యాచుల్లో 41 వికెట్లు తీసి ఓవరాల్ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.
అంది వచ్చిన ఐపీఎల్
పంజాబ్ జట్టు తరఫున చేసిన ప్రదర్శన సందీప్‌కు ఐపీఎల్‌లో చోటు కల్పించింది. గత ఏడాది ఆరో సీజన్ కోసం కింగ్స్ ఎలెవన్ అతడిని ఎంపిక చేసుకుంది. 4 మ్యాచ్‌లే ఆడి 14.87 సగటుతో 8 వికెట్లు తీయడంతో అతనిపై ప్రశంసలు కురిసాయి. ఇదే ఆట కింగ్స్ ఎలెవన్‌తో మరో అవకాశాన్ని కల్పించింది. ఈ ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌తో సందీప్ శర్మ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. లీగ్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో చక్కటి ప్రదర్శన (1/26, 3/21, 3/15) కనబర్చిన అతను రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ముఖ్యంగా గేల్, కోహ్లిలాంటి ఆటగాళ్ల వికెట్లు తీయడం సందీప్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
నిలకడే కీలకం
ఈ ఏడాది ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయాలు చూస్తే ఇప్పుడు అందరి దృష్టి ఆ జట్టుపైనే ఉంది. జట్టు విజయాల్లో భాగస్వామిగా ఉన్న సందీప్ ఆటను కూడా అంతా గమనిస్తున్నారు. భారత్‌కు ఆడిన ప్రవీణ్ కుమార్, భువనేశ్వర్ కుమార్‌ల శైలిని సందీప్ బౌలింగ్ పోలి ఉంటుంది. పేస్ బౌలింగ్‌లో పదును పెరిగేందుకు మిచెల్ జాన్సన్ సాహచర్యంలో ఎంతో నేర్చుకుంటున్నానని అతను చెప్పాడు. ఐపీఎల్ ప్రదర్శనే ప్రాతిపదిక కాకున్నా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ రాణిస్తుండటం శర్మకు అదనపు బలం. దేశవాళీలో మరో రెండు సీజన్ల పాటు నిలకడగా ఆడితే అతనికి భారత జట్టులోకి వచ్చేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే టీమిండియాలో పేసర్ల మధ్య ప్రస్తుతం గట్టి పోటీ ఉంది. చాలామంది వస్తున్న పెద్దగా ఆకట్టుకునే వాళ్ల సంఖ్య తక్కువగా ఉంది. అలా మెరిసి ఇలా పోయే బౌలర్ల జాబితాలో కాకుండా సుదీర్ఘ కాలం పాటు ఆడే క్రికెటర్‌గా సందీప్ శర్మ నిలవాలని ఆశిద్దాం.