
సానియా అదరహో...
సింగపూర్: మహిళల సింగిల్స్ ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి జోడీ కట్టిన తరువాత అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తున్నభారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మరోసారి అదరగొట్టింది. సీజన్ ముగింపు టోర్నీ అయిన డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ ట్రోఫీని కైవసం చేసుకుని తమ జంటకు తిరుగులేదని నిరూపించింది. ఆదివారం జరిగిన తుదిపోరులో సానియా ద్వయం 6-0, 6-3 తేడాతో ఎనిమిదో సీడ్ ముగురుజ్జా-సూరేజ్ నవరో (స్పెయిన్) జంటపై విజయం సాధించి టైటిల్ ను ముద్దాడింది. దీంతో ఈ జోడీ సాధించిన టైటిల్స్ సంఖ్యను తొమ్మిదికి పెంచుకోగా.. ఆ జోడీ ఖాతాలో వరుసగా 22 వ విజయం వచ్చి చేరింది. ఓవరాల్‌గా సానియా కెరీర్‌లో ఇది 32వ డబుల్స్ టైటిల్ కాగా... హింగిస్‌కిది 50వ డబుల్స్ టైటిల్ కావడం మరో విశేషం.
తొలి సెట్ లో సానియా జోడి వరుస బ్రేక్ పాయింట్లను సాధించి ఆ గేమ్ ను దక్కించుకోగా, రెండో సెట్ లో మాత్రం స్పెయిన్ జంట నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. కాగా, ఎక్కవ తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకుండా ఆ సెట్ ను సాధించి మ్యాచ్ విన్నర్ గా అవతరించింది. వీరిద్దరూ జోడి కట్టిన అనంతరం పదిసార్లు ఫైనల్స్ కు చేరగా, ఒక్కసారి మాత్రమే ఓటమి చవిచూశారు. తాజా విజయంతో ఈ ఏడాది సానియా ఖాతాలో పది టైటిల్స్ చేరాయి. అందులో తొమ్మిది టైటిల్స్ ( డబ్యూటీఏ టూర్ ఫైనల్స్, ఇండియన్ వెల్స్, మియామి, చార్ల్స్‌టన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్‌జూ, వుహాన్, చైనా ఓపెన్) హింగిస్‌తో కలిసి సాధించగా... మిగతా ఒకటి (సిడ్నీ ఓపెన్) బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సానియా దక్కించుకుంది.
ఈ టోర్నీలో సానియా-హింగిస్ ల జోడి ఆట సాగిందిలా..
గత సోమవారం జరిగిన డబుల్స్ తొలి మ్యాచ్ సానియా-హింగిస్ జోడీ 6-4, 6-2తో రాకెల్ కాప్స్ జోన్స్-అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా) జంటపై విజయం సాధించి శుభారంభ చేసింది. 75 నిమిషాల్లో మ్యాచ్ ను ముగించి మొదటి అడ్డంకిని అధిగమించింది.
బుధవారం జరిగిన ‘రెడ్ గ్రూప్’ లీగ్ మ్యాచ్‌లో సానియా-హింగిస్ ద్వయం 6-3, 6-4తో ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించి దాదాపు సెమీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. 76 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్ లో సానియా జోడీకి రెండో సెట్ లో గట్టి పోటీ ఎదురైనా విజయాన్ని సొంతం చేసుకుంది.
శుక్రవారం జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్ లో సానియా జోడి 6-4, 7-5 తేడాతో తిమియా బాబోస్(హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)లపై గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. 90 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో సానియా గట్టి పోటీని ఎదుర్కొని పోరులో నిలబడింది.
డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జంట 6-4, 6-2 తేడాతో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) పై విజయం సాధించి ఫైనల్స్ కు చేరింది. గంటా 23 నిమిషాల పాటు జరిగిన పోరులో సానియా జోడి పోరాడి తుది పోరుకు అర్హత సాధించింది.