'ఎస్' ఫర్ సక్సెస్!
ఆ ఇద్దరూ తమ తమ క్రీడలో ప్రతిభా వంతులే. వారి కెరీర్ లో ఎన్నో అద్భుత విజయాలు.. మరెన్నో మధురానుభూతులు. అంతర్జాతీయ యవనికపై ఎస్ ఫర్ సక్సెస్ అన్న చందంగా రాణిస్తున్నక్రీడాకారిణులు. ఒకరు భారత టెన్నిస్ కు వన్నె తెచ్చిన క్రీడాకారిణి సానియా మీర్జా అయితే మరొకరు బ్యాడ్మింటన్ లో సంచలనాలతో దూసుకుపోతున్న సైనా నెహ్వాల్. తమ ఆటలో ఎన్నో ఎత్తుపల్లాలను చూడటంతో పాటు, అనేక మైలురాళ్లను అందుకుని శభాష్ అనిపించుకున్నారు. కెరీర్ లో పడిపోయిన మరుక్షణమే అంతే వేగంగా పైకి ఎగసి తమకు సాటి లేదని నిరూపించుకున్నారు.. నిరూపించుకుంటూనే ఉన్నారు.
తాజాగా ఆ ఇద్దరూ క్రీడాకారిణులు 'పద్మ' అవార్డు పురస్కారానికి ఎంపికయ్యారు. భారత ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో సానియా, సైనాలు పద్మ భూషణ్ అవార్డును అందుకోనున్నారు. ఈ ఏడాది మొత్తం 118 మందికి పద్మఅవార్డులను ప్రకటించగా, 10 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు.
గతంలో పద్మ శ్రీ పురస్కారాన్ని ఈ ఇద్దరూ క్రీడాకారిణులు అందుకున్నా.. ఈసారి వారిని పద్మ భూషణ్ వరించింది. తొలిసారి 2004లో అర్జున అవార్డును అందుకున్న సానియా మీర్జా.. 2006లో పద్మ శ్రీ అవార్డును అందుకుంది. ఆ తరువాత 2015లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్నా పురస్కారం సానియాకు లభించింది. మరోవైపు సైనా నెహ్వాల్.. అర్జున అవార్డును 2009లో అందుకోగా, రాజీవ్ గాంధీ ఖేల్ రత్నాను 2009-10 సంవత్సరానికి గాను, అలాగే పద్మశ్రీని అవార్డును 2010 వ సంవత్సరంలో అందుకుంది.