‘అష్ట’ చమక్
చైనా ఓపెన్ విజేత సానియా-హింగిస్ జోడి
ఈ సీజన్‌లో జతగా ఎనిమిదో టైటిల్
రూ. 2.13 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం
బీజింగ్: ఏ శుభ సమయాన మార్టినా హింగిస్‌తో జోడీ కుదిరిందోగానీ ఈ ఏడాది సానియా మీర్జా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. కలయా, నిజమా అన్నట్టు ఈ హైదరాబాద్ అమ్మాయి తన స్విట్జర్లాండ్ భాగస్వామితో కలిసి ఈ ఏడాది ఎనిమిదో టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం ముగిసిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జంట తమ సీడింగ్‌కు తగ్గట్టుగా రాణించి విజేతగా అవతరించింది. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్ పోరులో సానియా-హింగిస్ ద్వయం 6-7 (9/11), 6-1, 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో ఆరో సీడ్ హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జంటకు 3,29,354 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 13 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఈ గెలుపుతో సానియా ఖాతాలో ఈ ఏడాది తొమ్మిదో టైటిల్ చేరింది. ఎనిమిది టైటిల్స్ (ఇండియన్ వెల్స్, మియామి, చార్ల్స్‌టన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్‌జూ, వుహాన్, చైనా ఓపెన్) హింగిస్‌తో కలిసి సాధించగా... మిగతా ఒకటి (సిడ్నీ ఓపెన్) బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సానియా దక్కించుకుంది. ఓవరాల్‌గా సానియా కెరీర్‌లో ఇది 31వ డబుల్స్ టైటిల్ కాగా... హింగిస్‌కిది 49వ డబుల్స్ టైటిల్. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో సానియా జోడీ తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయింది.
గంటపాటు జరిగిన ఈ సెట్‌లో ఆరంభంలోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా-హింగిస్ ఆ తర్వాత తమ సర్వీస్‌ను కోల్పోయింది. టైబ్రేక్‌లోనూ నువ్వా నేనా అన్నట్లు పోరాడినా తుదకు కీలకదశలో తడబడి సెట్‌ను చేజార్చుకుంది. అయితే రెండో సెట్‌లో సానియా-హింగిస్ జంట చెలరేగింది. ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో సానియా-హింగిస్ సమన్వయంతో రాణించి కీలకదశలో పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. కేసీఆర్ అభినందన చైనా ఓపెన్ టైటిల్ సాధించిన సానియా జోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అభినందనలు తెలిపారు.